Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్లాక్ ఫంగస్: భారతదేశంలో దాదాపు 9 వేల ఇన్ఫెక్షన్ కేసులు

Advertiesment
బ్లాక్ ఫంగస్: భారతదేశంలో దాదాపు 9 వేల ఇన్ఫెక్షన్ కేసులు
, సోమవారం, 24 మే 2021 (11:20 IST)
భారతదేశంలో 8,800కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులు మహమ్మారిలా పెరుగుతున్నాయి. అరుదుగా వచ్చే ఈ మ్యూకోర్‌మైకోసిస్ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో 50 శాతం మంది మరణిస్తున్నారు. ఇన్పెక్షన్ సోకిన కంటిని తొలగించడం ద్వారా కొంత మంది మాత్రం ప్రాణాలతో బయటపడుతున్నారు. కానీ, ఇటీవల కాలంలో కోవిడ్ బారిన పడినవారు, కోవిడ్ బారిన పడి కోలుకుంటున్న కొన్ని వేల మందిలో ఈ ఇన్ఫెక్షన్ కనిపిస్తోంది.

 
తీవ్ర లక్షణాలతో కోవిడ్ బారిన పడినవారికి చికిత్సలో భాగంగా ఇచ్చిన స్టెరాయిడ్ల కారణంగా ఈ ఇన్‌ఫెక్షన్ సోకుతోందని డాక్టర్లు అంటున్నారు.. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఎక్కువ ముప్పు ఉంటోంది. కోవిడ్ నుంచి కోలుకున్న 12-18 రోజుల్లో ఈ ఇన్ఫెక్షన్ సోకుతోందని డాక్టర్లు బీబీసీకి చెప్పారు. నమోదయిన కేసుల్లో సగం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచే ఉన్నాయి. కనీసం 15 రాష్ట్రాల్లో 800 నుంచి 900 మధ్య కేసులు నమోదయ్యాయి.

 
ఈ కేసులు పెరుగుతుండటంతో ఈ ఇన్ఫెక్షన్ ను మహమ్మారిగా ప్రకటించమని కేంద్ర ఆరోగ్య శాఖ 29 రాష్ట్రాలను కోరింది. ఈ ఇన్ఫెక్షన్ బారిన పడే వారికి చికిత్స చేసేందుకు కొత్తగా తెరిచిన ఆసుపత్రుల్లో వార్డులు కూడా వేగంగా నిండిపోతున్నాయని డాక్టర్లు చెప్పారు. గత వారం ఇండోర్‌లోని 1100 పడకలు ఉన్న మహారాజా యశ్వంత్ రావు ఆస్పత్రిలో ఈ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న రోగులు 8 మంది ఉండగా శనివారం సాయంత్రానికి వారి సంఖ్య 185 మందికి పెరిగింది.

 
"వీరిలో 80 శాతం మందికి వెంటనే శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉంది" అని ఆస్పత్రిలో మెడిసిన్ విభాగపు అధిపతి డాక్టర్ విపి పాండే బీబీసీకి చెప్పారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి చికిత్స చేసేందుకు ఆస్పత్రిలో 200 పడకలతో 11 వార్డులను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. "ఈ ఇన్ఫెక్షన్ తో వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని కచ్చితంగా ఊహించలేదు. ఏడాదికి ఇలాంటి కేసులు ఒకటో, రెండో వచ్చేవి" అని అన్నారు. ఒక్క ఇండోర్‌లోనే బ్లాక్ ఫంగస్ సోకిన రోగులు కనీసం 400 మంది ఉంటారని ఆయన అన్నారు.

 
"బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్, కోవిడ్ 19 కంటే కూడా పెద్ద సవాలుగా మారింది. ఈ ఇన్ఫెక్షన్ సోకిన రోగులకు సమయానికి చికిత్స చేయకపోతే, మరణాల రేటు 94 శాతానికి పెరిగే ప్రమాదం ఉంది. దీనికయ్యే ఖర్చు చాలా ఎక్కువ. మందుల కొరత కూడా ఉంది" అని డాక్టర్ పాండే అన్నారు. మ్యూకోర్‌మైకోసిస్ సోకిన రోగులకు ప్రతి రోజూ 8 వారాల వరకు 'యాంఫోటెరిసిన్-బీ' యాంటీ ఫంగల్ ఇంజక్షన్ ఇవ్వాలని డాక్టర్లు చెబుతున్నారు. ఈ మందులు సాధారణ యాంఫోటెరిసిన్-బీ డీఆక్సీకోలేట్, లైపోసోమల్ ఆంఫోటెరిసిన్ అనే రెండు రూపాల్లో లభిస్తున్నాయి.

 
నగరంలోని నాలుగు ఆస్పత్రుల్లో 201 మంది రోగుల సమాచారాన్ని సేకరించినట్లు డాక్టర్ పాండే చెప్పారు. ఇందులో ఎక్కువగా కోవిడ్ 19 నుంచి కోలుకున్న పురుషులు ఉన్నారు. వాళ్లలో చాలా మందికి కోవిడ్ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లతో వైద్యం అందించారు. వారందరికీ మధుమేహం ఉంది. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకిన మరో 100 మంది రోగులపై జరిగిన మరో అధ్యయనంలో కూడా 79 మంది పురుషులు ఉండగా, అందులో 83 మంది మధుమేహంతో బాధపడుతున్నవారేనని తెలిసింది.

 
ముంబయిలోని రెండు ఆస్పత్రుల్లో ఉన్న 45 మందిపై చేసిన మరో అధ్యయనంలో కూడా ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారందరికీ మధుమేహం ఉన్నట్లు తెలిసింది. వారందరికీ రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. "మ్యూకోర్‌మైకోసిస్ సోకిన రోగులందరికీ మధుమేహం సాధారణ స్థాయిలో లేదు" అని ఇన్ఫెక్షన్ సోకిన రోగులకు చికిత్స చేసిన కంటి వైద్య నిపుణుడు డాక్టర్ అక్షయ్ నాయర్ బీబీసీకి చెప్పారు.

 
మ్యూకోర్‌మైకోసిస్ అంటే ఏంటి?
మ్యూకోర్‌మైకోసిస్ అరుదుగా వచ్చే ఇన్ఫెక్షన్. ఇది సాధారణంగా మట్టిలో, మొక్కల్లో, ఎరువులో, కుళ్లిపోయిన పళ్ళు, కాయగూరల్లో ఉండే మ్యూకర్ అనే ఫంగస్ వల్ల వ్యాపిస్తుంది. "ఇది అన్ని చోట్లా ఉంటుంది. గాలిలో, మట్టిలో మాత్రమే కాకుండా ఆరోగ్యకరంగా ఉండే వారి ముక్కులో కూడా ఉంటుంది" అని డాక్టర్ అక్షయ్ నాయర్ చెప్పారు.

 
ఇది సైనస్, మెదడు, ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి, ముఖ్యంగా కేన్సర్, హెచ్ఐవీ/ఎయిడ్స్‌లాంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ జిల్లా: అమ్మోనియా కంపెనీలో గ్యాస్ లీక్, భయంతో పరుగులు తీసిన జనం