ఏపీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి విదేశీ పర్యటన ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు ఇజ్రాయెల్ దేశంలోని జెరుసలేంలో ఆయన పర్యటించబోతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్లి, అక్కడి నుంచి నేరుగా బయలుదేరారు. తిరిగి ఈ నెల 5న తాడేపల్లి చేరుకుంటారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
జగన్ తొలి పర్యటన చుట్టూ ఇప్పుడు వివాదం అలముకుంది. ఆయన పర్యటన వ్యక్తిగతం అని చెబుతూ దానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడాన్ని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ జులై 31న విడుదల చేసిన జీవో ఆర్టీ నెంబర్ 1737 ప్రకారం జగన్ పర్యటన కోసం ఏపీ ప్రభుత్వం 30,531 అమెరికన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. దానికి గాను మన కరెన్సీ ప్రకారం రూ.22,52,500 విడుదల చేసింది.
ఇజ్రాయెల్‌కు చెందిన ట్రిపుల్ ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు ఈ నిధులు చెల్లించారు. హైదరాబాద్‌కి చెందిన ఎయిర్ ట్రావెల్ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా వాటిని చెల్లిస్తున్నట్టు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను పలువురు ప్రశ్నిస్తున్నారు. దానిపై కాలమిస్ట్ కుసంపూడి శ్రీనివాస్ వ్యాఖ్యానిస్తూ "సీఎం తన కుటుంబంతో తన వ్యక్తిగత పనిపై జెరూసలేం వెళుతున్నారు. పైగా సొంత ఖర్చుతో ఆయన విదేశీ పర్యటన చేస్తున్నారని ప్రచారం చేసుకున్నారు. అయినా ఈ పర్యటన పేరుతో ఏపీ ప్రభుత్వం భారీగా ఖర్చు చేయడం విస్మయకరం. నిజానికి ఆయన కుటుంబం మొత్తం చేసే ఖర్చు కన్నా ప్రభుత్వ వ్యయమే ఎక్కువగా కనిపిస్తోంది. రానుపోనూ టికెట్ ఛార్జీలు, ఇతర ఖర్చులు చూసినా అంత పెద్ద మొత్తం ఖర్చు కాదు" అంటూ చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో నిధుల వినియోగంపై బీబీసీ తెలుగు ఏపీ ప్రభుత్వ అధికారులను సంప్రదించింది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి రామ్ ప్రసాద్ సిసోడియా స్పందించారు. జడ్ కేటగిరీలో ఉన్న వారి భద్రతకు అవసరమైన ఏర్పాట్లు చేయడం సాధారణ పరిపాలనా శాఖలో భాగమేనని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా వ్యాఖ్యానించారు.
"ముఖ్యమంత్రి పర్యటనకు తగిన భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిది. సీఎం హోదాలో ఉన్న వారు వ్యక్తిగత పర్యటనలకు వెళ్లినా భద్రత మాత్రం ప్రభుత్వం తీసుకుంటుంది. జడ్ కేటగిరీలో ఉన్న వారందరికీ అలాంటి ఏర్పాట్లు ఉంటాయి. సీఎం పర్యటనకు ఇజ్రాయెల్‌కు చెందిన ప్రైవేట్ ట్రావెల్ ఏజన్సీకి బాధ్యత అప్పగించాం. ఏపీ ప్రభుత్వంతో ఆ ట్రావెల్ ఏజన్సీకి ఒప్పందం ఉంది. అందులో భాగంగానే జీవో విడుదల చేసి నిధులు చెల్లించామని" ఆయన వివరించారు.
రాష్ట్రపతి, ప్రధానికి తప్ప అందరికీ ఇది తప్పదు..
ప్రముఖులు పర్యటనల్లో ఉన్నప్పుడు అవసరమైన సెక్యూరిటీ ఏర్పాట్లు తప్పవని సీనియర్ జర్నలిస్ట్ విజయ్ చంద్రన్ వ్యాఖ్యానించారు. జగన్ వ్యక్తిగత పర్యటనకు ప్రభుత్వ నిధుల వెచ్చించిన జీవో వివాదాస్పదం అయిన నేపథ్యంలో తన అభిప్రాయాన్ని బీబీసీతో పంచుకున్న విజయ్ చంద్రన్.. "వీఐపీలకు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అది స్వదేశంలో అయినా, విదేశాల్లో అయినా తప్పదని నిబంధనలున్నాయి.
విదేశాలకు వెళ్లినప్పుడు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి తప్ప అందరికీ అవసరమైన పక్షంలో మన ప్రభుత్వాలే భద్రత ఏర్పాటు చేయాలి. కొన్నిసార్లు ప్రధానికి కూడా మనమే సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో నిబంధనల ప్రకారం మన సెక్యూరిటీకి సమస్య అవుతుంది కాబట్టి, అత్యధిక సందర్భాల్లో అక్కడి సెక్యూరిటీ ఏజన్సీలతో ఒప్పందాలు చేసుకుంటారు.
గతంలో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు పర్యటనల్లో కూడా అదే జరిగింది. ప్రస్తుతం జగన్ పర్యటనలో సెక్యూరిటీ ఏర్పాటు చేయడం, అవసరమైన మేరకు నిధులు విడుదల చేయడంపై వివాదం సమంజసం కాదని" పేర్కొన్నారు.