Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గృహిణి బాధ్యతలు ఇంతింత కాదయా...

Advertiesment
గృహిణి బాధ్యతలు ఇంతింత కాదయా...

WD

సామాన్య లేదా మధ్య తరగతి కుటుంబాల్లో ఇంటి చాకిరి అంతా ఇల్లాలిపైనే పడుతుంది. సూర్యుడు కన్నా ముందుగా నిద్రలేస్తుంది గృహిణి. అంతా తనే చూసుకుంటుందన్న ధీమాతో ఆదమరిచి నిద్రపోతున్న పతిదేవుని, పిల్లలను నిద్రలేపాలి. వాళ్లు ఒక పట్టాన నిద్రలేవరు. అదేసమయంలో పొయ్యి మీద పెట్టిన పాలు ఎక్కడ పొంగుతాయనే ఆదుర్దాలో సూపర్‌సోనిక్ విమానం కన్నా వేగంగా వంటింట్లోకి పరిగెత్తి నువ్వా నేనా అన్నట్లు శివుని శిరస్సు నుంచి నేల మీదకు దూకుతున్న గంగ వలె కాచుకున్న పాలపొంగును స్టవ్‌ కట్టేయడం ద్వారా పాలు కింద పడకుండా ఆపి ఒలింపిక్స్‌లో పతాకం సాధించిన పరుగులరాణి పీటీ ఉషలా ఆనందపడుతుంది. ఆ ముచ్చట తీరకముందే బెడ్‌రూమ్ నుంచి పతిదేవుని గావుకేక. రాత్రి చేయగా మిగిలిపోయిన హోమ్ వర్క్‌ను చేయకుండా పోట్లాడుకుంటూ గోల చేస్తున్న పిల్లలు.

వాళ్లకు కావాల్సినవన్నీ అమర్చి కాసేపు కుర్చీలో కూర్చుందామనుకంటే చాలు... శ్రీవారు ఒక రకంగా చూసి " మధ్యాహ్నమంతా ఖాళీయే కదా... అప్పుడు రెస్టు తీసుకుందువు గానీ... ముందు నాకు కర్చీఫ్ వెదికిపెట్టు", అనేసి టిఫిన్ కోసమని కుర్చీలో కూర్చుని మరోసారి న్యూస్ పేపర్‌ను చదవడం మొదలుపెడతారు. మోటర్ సైకిల్ ఉన్నా కూడా పిల్లలను స్కూల్లో దింపాలంటే శ్రీవారికి మా చెడ్డ చిరాకు... ప్రతిరోజూ ఆఫీసులో అర్జెంట్ పని ఉందంటూ వెనక్కి కూడా తిరిగి చూడకుండా మోటర్ సైకిల్ మీద ఎవరో తరుముతున్నట్లుగా వెళ్లిపోతారు. పిల్లలను స్కూల్ దగ్గర దించి వచ్చేసరికి వంటింట్లో అంట్ల గిన్నెలు, హాలులో చిందరవందరగా పడేసి ఉన్న పుస్తకాలు, స్నానం చేసి తుడుచుకున్న టవళ్లు మా సంగతేమిటన్నట్లు చూస్తుంటాయి.

ఇక అన్ని పనులు ముగించేసి భోజనం చేసి కాసేపు కునుకు తీద్దామనుకునేలోగా ఎల్కేజీ చదువుతున్న నానీని స్కూల్ నుంచి తీసుకు రావలసిన సమయం ఆసన్నమవుతుంది. ఇంటికి తెచ్చీరాగానే అన్నం తిననని మారాం చేస్తాడు. దాంతో ఏదో ఒక అల్పాహారం చేయాల్సి వస్తుంది. ఈలోగా మేడమీది మీనాక్షమ్మ గారికి ఊసుపోక కబుర్లతో కాలక్షేపం చేద్దామని కిందకు వస్తారు. పనిలో ఉన్నానని ఇప్పుడు కాదని చెప్తామంటే ఆవిడ ఫీల్ అవుతుంది. పైగా ఇంటి ఓనరమ్మ కూడాను. ఆమె ఆగ్రహించిందంటే కొత్త ఇంటిని వెదుక్కునే అదనపు పని కూడా ఆ ఇల్లాలి ఖాతాలో వచ్చి చేరుతుంది. మీనాక్షమ్మ అలా ఒక రెండు గంటలు తిష్టవేసి కబుర్లతో కడుపు నింపుకుని మేడ మీదకు వెళ్లిపోతారు. మధ్యలో ఎనిమిదో తరగతి చదువుతున్న బుజ్జి కూడా స్కూల్ నుంచి వచ్చేస్తుంది. రెప్పపాటులోనే సాయంత్రమవుతుంది.

సాయంత్రమయ్యేసరికి పిల్లల స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్లు, లంచ్ బాక్స్, మేజోళ్లు ఇంట్లో ఉండాల్సిన చోట ఉండక హాలులో చిందరవందరగా పడేసి ఉంటాయి. వాటిని సర్దే కార్యక్రమానికి బదులుగా మరో ముఖ్యమైన ఇంటి పనులు పెట్టుకుంటే ఇల్లాలి పని అంతే సంగతి. ఆఫీసులో తలనొప్పులన్నీ ఇంటి దాకా మోసుకు వచ్చే పతిదేవుడు వాటిని చూసాడా... ఆ ఇల్లాలి కోర్టు మార్షల్ మొదలవుతుంది. వీటిన్నింటి నుంచి కాస్త విశ్రాంతి కోసం కొద్ది రోజులు పుట్టింటికి వెళ్లి వస్తానని ఆమె చెప్పడం ఆలస్యం ఎల్కేజీ చదివే నానీ నుంచి ఎనిమిదవ తరగతి చదివే బుజ్జి వరకు తమ సమస్యల చిట్టా విప్పుతారు. " అమ్మా నువ్వు ఊరికెళితే మాకు టిఫిన్ ఎవరు చేసిపెడతారు? మా యూనిఫామ్ ఎవరు ఉతికి పెడతారు? అందుకని నువ్వు ఊరికెళ్లొద్దు..." ఇక ఇక్కడ శ్రీవారు మరో విధంగా ఆమె ప్రయాణాన్ని అడ్డుకునే మాటల మంత్రాలు వల్లె వేస్తారు, " పదిహేను రోజుల క్రితం బుక్ చేసిన గ్యాస్ సిలిండర్ మరో రెండు మూడు రోజుల్లో వస్తుంది. ఇంట్లో ఎవరూ లేరని సిలిండర్ వాడు వెళ్లిపోతే మళ్లీ తెప్పించుకోవడానికి మహా యజ్ఞమే చెయ్యాలి. నీపాటికి నువ్వు వెళ్లిపోతే నానీ హోమ్ వర్క్ ఎవరు చేసిపెడతారు? అయినా నువ్వు అక్కడకు వెళ్లి చేసేదేముంటుంది. ఈ సారి ఎప్పుడైనా వెళ్దువుగాని..."

ఉద్యోగం చేయాలనే ఆశను వదులుకుని ఇంటి బాధ్యతలను నెత్తిన వేసుకున్న భార్య లేదా గృహలక్ష్మి ద్వారా ఎవరైతే చదువు చెప్పించుకుంటున్నారో, తమ అవసరాలను తీర్చుకుంటున్నారో వారు అనే మాటలివి. ఆమె ఆలోచనలకు, ఆశలకు ఏ మాత్రం ప్రాధాన్యతను ఇవ్వకుండా తమ పబ్బం గడుపుకునేందుకు చెప్పే సాకులివి. తాను లేని సమయంలో కుటుంబ సభ్యులు చెప్పే కష్టాలను కన్నుల ముందు ఒక్కసారిగా ఊహించుకున్న ఆ ఇల్లాలు అంతటితో తన పుట్టింటి ప్రయాణానికి స్వస్తి చెప్తుంది. అయితే ఆ గృహిణికి అప్పుడప్పుడు మెరుపు కలలు వస్తుంటాయి. అది నిజమవుతుందా లేదా అన్నేది పక్కన పెట్టి ఇల్లాలి కలను ఒకసారి వీక్షిద్దాం.

తనతో పాటు కుటుంబ సభ్యులందరూ పెందలకడనే నిద్ర లేస్తారు!!! ఆమె వాకిలి ముంగిట నీళ్లు చల్లి ముగ్గు వేసి వచ్చేసరికి పతిదేవుడు, పిల్లలు తమంతట తాముగానే బ్రష్ మీద పేస్టు వేసుకుని దంతధావనం చేసుకుని హాల్లో కూర్చుని ఉంటారు. ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుందంటే... ఎల్కేజీ చదువుతున్న నానీకి ఎనిమిదో తరగతి చదువుతున్న బుజ్జీ హోమ్ వర్క్ చేయిస్తుంటుంది. ప్రతిరోజూ లేవగానే న్యూస్ పేపర్లో తలదూర్చి కాఫీ కోసం ఉష్ట్రపక్షిలా అప్పడప్పుడూ తలపైకెత్తి గావు కేకలు పెట్టే పతిదేవుడు... అందుకు భిన్నంగా పిల్లల షూలకు పాలిష్ పెడుతూ కనిపించారు. అక్కడితో స్వప్నం సమాప్తం కాలేదు. పిల్లలకు బూస్టు, ఇంటాయనకు కాఫీ కలుపుకు వచ్చేసరికి హాల్లో ఎవరూ లేరు. ఏమయ్యారా అని వెతికితే... పక్క గుడ్డలను మడతేసి చక్కగా అలమరలో పెడుతూ కనిపించారు శ్రీవారు. పిల్లలేమైపోయారా అని చూస్తే బాత్ రూమ్‌లో కనపడిన దృశ్యం మరింత మనోహరంగా ఉంది.. నానీకి స్నానం చేయిస్తోంది బుజ్జీ.... అలా అలా సాగిపోతున్న స్వప్నం మిగిలిపోయిన పనులు గుర్తుకురావడంతో ఒక్కసారిగా కనుమరుగైపోతుంది.

వేడి నిట్టూర్పు విడిచి తిరిగి పనుల్లో నిమగ్నమైపోతుంది సగటు భారతీయ సామాన్య మధ్యతరగతి ఇల్లాలు. కలలు కనండి... నిజం చేసుకోండి... అని ప్రజలకు పిలుపునిచ్చే వారికి కొదవలేదు మన సమాజంలో... కానీ కుటుంబ అవసరాలు తీర్చడం ద్వారా సమసమాజ నిర్మాణంలో కొవ్వొత్తుల కరిగిపోతూ త్యాగానికి మారుపేరుగా నిలుస్తున్న భారతీయ గృహిణి కలలను గురించి అడిగేవారే లేరు. ఇల్లాలి కలలను నిజం చేయడానికి విజన్ 2020 కాదుకదా విజన్ 2050 కూడా సరిపోదేమో....

Share this Story:

Follow Webdunia telugu