Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంగాంగ ప్రదర్శనతో ప్రగతి సాధ్యమా?!

Advertiesment
అంగాంగ ప్రదర్శనతో ప్రగతి సాధ్యమా?!

WD

, శనివారం, 8 మార్చి 2008 (13:24 IST)
FileFILE
జీవనోపాధి, పోటీ ప్రపంచంలో ఆధిపత్యం, కోరినంత ధనం, తక్కువ కాలంలో పేరు ప్రతిష్టలు (?) పొందాలనే వ్యామోహ సాగరంలో కొందరు స్త్రీలు మునిగి తేలుతున్నారు. తమ స్వార్థం కోసం సభ్యతా సంస్కృతులకు ఉద్వాసన పలికి మహిళా జగతి యొక్క పవిత్రతను దిగజార్చే దిశగా పరిగెడుతున్నారు. ఆధునికత, స్వేచ్ఛలు సాకుగా ఈ కాలపు టీవీ సీరియళ్లు, సినిమాలు మరియు వ్యాపార ప్రకటనల్లో స్త్రీలు అంగాంగ ప్రదర్శనలు చేస్తూ దిగజారుడుతనానికి ప్రతీకలవుతున్నారు. వాణిజ్య ప్రకటనల్లో మహిళ చేస్తున్న నగ్న ప్రదర్శన గడచిన దశాబ్ద కాలంలో స్త్రీ సాధించిన అత్యున్నత ప్రగతిని (?) పురుష ప్రపంచానికి చాటి చెప్తోంది.

దగ్గరి దారుల్లో కీర్తి ప్రతిష్టలను మూటగట్టుకుంటున్నామనే ఆనందంలో స్త్రీ సహజమైన సిగ్గు, మానాభిమానాలకు గుడ్‌బై చెప్పి ఆధునికత మహిళకు మేమే మార్గదర్శకులమని బాహటంగా చెప్పుకుంటున్నారు. గ్రామాలు లేదా నగరాల్లోని మహిళలు కుటుంబ సభ్యులైన భర్త లేదా అత్తగారి నుంచి ఎదుర్కునే వేధింపులను న్యాయస్థానాలు, సమాజ సేవాసంస్థల దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా, పుట్టింటి వారి మద్దతుతో వాటి నుంచి బయటపడవచ్చు. అలాగే ఆఫీసుల్లో పురుష ఉద్యోగులు చేసే లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయాన్ని పొందవచ్చు. అదేసమయంలో దోషులు తగిన శిక్షను అనుభవిస్తారు.

కానీ అయాచితంగా వచ్చిపడే ధనం, పేరు ప్రతిష్టల మత్తులో పడి తనంతట తానుగా అంగాంగ ప్రదర్శనకు పాల్పడే స్త్రీని మార్చడం ఆ పరమశివునికి కూడా సాధ్యం కాదు. ఇక టీవీ సీరియళ్లలో మహిళా పాత్రలు విశృంఖలతకు అద్దం పడుతున్నాయి. సోదరి, కూతురు, వదిన, తల్లి పాత్రలు తమ హద్దులను చెరిపేసుకుని ఒక చేతిలో సిగరెట్, మరో చేతిలో మద్యం గ్లాసుతో పెత్తనాన్ని చెలాయిస్తున్న వైనం సగటు భారతీయ డ్రాయింగ్ రూమ్‌లకు వ్యాపించింది. అప్పడప్పుడు ప్రియుని కౌగిలిలో పరవశాన్ని అభినయించే నాయికామణులు కూడా టీవీ సీరియళ్లలో ప్రత్యక్షమౌతుంటారు. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ఆధునిక భావజాలానికి ఆయా పాత్రలు అద్దం పట్టాయాని భావించాలా? లేక విశృంఖలమైన స్వేచ్ఛకు భారతీయతను అద్దుతున్నారో తెలియని అయోమయంలో సభ్య సమాజం తలదించుకుంటోంది.

శక్తి స్వరూపిణిగా, తల్లిగా, చెల్లిగా, భార్యగా బహుముఖ పాత్రలు పోషిస్తూ మానవ సమాజంలో అత్యున్నత స్థానాన్ని పొందిన స్త్రీ, ఇలా తనకుతానుగా దిగజారిపోతుండటం సాధికారత సాధనలో భాగమని భావించాలా? పురుషాధిక్య సమాజంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునే మార్గమని అనుకోవాలా? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ తనదైన విశిష్ట స్థానాన్ని కాపాడుకునే క్రమంలో ఇలాంటి హేయమైన స్థితికి స్వస్తి చెప్పి ఆరోగ్యకరమైన నవసమాజ నిర్మాణంలో పాలుపంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu