విజయ నిర్మల- జమునలకు అభినందనలు: బి. సరోజ
అలనాటి అందాల నటి పద్మశ్రీ బి. సరోజా దేవి హైదరాబాద్ విచ్చేసి గ్రాండ్ కాకతీయ హోటల్‌లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు గ్రహీత జమునకు, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత విజయ నిర్మలకు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల, జమున, నరేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పద్మశ్రీ బి. సరోజాదేవి మాట్లాడుతూ... జమున, విజయ నిర్మల గార్లకు అభినందనలు తెలుపడానికే ప్రత్యేకంగా హైదరాబాదుకు వచ్చాను. మహానటులు ఎన్టీఆర్ గారంటే నాకు ఎంతో గౌరవం. ఆయన పేరు మీద రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జాతీయ అవార్డు మా జమున అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. జమున, నేను తరచుగా కలుస్తుంటాం. మాట్లాడుకుంటూ ఉంటాం. తనకి ఎన్టీఆర్ అవార్డు వచ్చినందుకు ప్రత్యక్షంగా కలిసి అభినందించాలనిపించింది. అందుకే పనిగట్టుకుని వచ్చాను. విజయనిర్మల, నేనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాం. ఒక మహిళా దర్శకురాలై ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించడం గ్రేట్. ఆ విధంగా విజయనిర్మల ఎంతో సాధించింది. విజయనిర్మలకు రఘుపతి వెంకయ్య అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. కృష్ణగారిని, విజయనిర్మలగారిని ఇలా కలుసుకోవడం ఎంతో సంతృప్తిగా ఉంది. కృష్ణగారు, జమున, విజయనిర్మల, బాలనటుడుగా నరేష్ అందరం పండంటి కాపురంలో నటించాం. ఇప్పుడు అందరం కలిసినపుడు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. కృష్ణగారి దర్శకత్వంలో నేను అల్లుడు దిద్దిన కాపురంలో నటించాను. త్వరలో విజయనిర్మల దర్శకత్వంలో నటించాలని ఉంది. కృష్ణగారి అబ్బాయి మహేష్ అంటే నాకు ఎంతో ఇష్టం. మహేష్ సినిమాలన్నీ టీవీలో వచ్చేటపుడు చూస్తుంటాను. అర్జున్, పోకిరి చిత్రాలు నాకెంతో నచ్చాయి. చాలా కాలం తర్వాత కృష్ణగారిని, విజయనిర్మలని జమునని ఇలా కలుసుకుని మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం వచ్చినందుకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది అన్నారు.జమున, కృష్ణ, విజయనిర్మల, నరేష్, బి.సరోజాదేవి గొప్పతనాన్ని నటిగా ఆమె సాధించిన అద్భుత విజయాలను గుర్తు చేసుకున్నారు. బి. సరోజాదేవిగారు హైదరాబాద్ రావడం ఆనందంగా ఉందన్నారు సూపర్ స్టార్ కృష్ణ. ఈ సందర్భంగా జమున, విజయనిర్మల బి. సరోజాదేవికి శాలువా కప్పి సత్కరించి పట్టు చీరలు బహూకరించారు. సీనియర్ ఆర్టిస్టులంతా కలిసి ముచ్చటించుకోవడం చూడముచ్చటగా ఉంది.