Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీరు ఏమాత్రం ఆనందంగా ఉన్నారు...?

Advertiesment
మీరు ఏమాత్రం ఆనందంగా ఉన్నారు...?

జ్యోతి వలబోజు

"సిరిమల్లె పువ్వల్లె నవ్వు… చిన్నారి పాపల్లె నవ్వు.." అంటూ ఎన్ని రకాలుగా బతిమాలుకున్నా నవ్వొచ్చినప్పుడే నవ్వుతారే గాని ఊరకూరకే ఉత్త నవ్వులు ఎవ్వరూ నవ్వరు. 'నవ్వు' అని మనమందరం పిలుచుకునే ఆహ్లాదకరమైన భావం వదనాన్ని వెలిగించాలంటే మనసు సంతోషంగా ఉండాలి. ఎన్ని జోకులు పేల్చినా డిప్రెషన్లో మునిగి ఉన్న వ్యక్తి నుంచి ఓ చిన్నపాటి చిరునవ్వును కూడా రాబట్టలేం. కాబట్టి దరహాసానికైనా వికట్టట్టహాసానికైనా మూలకారణం మానసికానందమేనన్నది నిశ్చయం.

"ధనమేరా అన్నిటికి మూలం" అని పాడుకుంటూ ఆనందించేవాళ్ళు తమ ఆనందాన్ని పక్కన పెట్టి కాసేపు విచారించాల్సిన తరుణం ఆసన్నమైంది. కనీసావసరాలు తీర్చుకోగలిగి కాస్త సౌకర్యవంతమైన జీవితం గడిపేంతవరకూ మాత్రమే సంపాదన పూర్ణానందాన్ని ఇవ్వగలదు.

అబ్దుల్ కలాం లాగానో ఐన్ స్టీన్ లాగానో అపరిమిత ప్రతిభాపాటవాలు కలిగినవారంతా ఆనందంగానే ఉంటున్నారా...? అంటే లేదనే సమాధానమే వస్తుంది. ఆశల్ని నెరవేర్చుకోలేకపోతున్నామనే బాధ వీరినీ అనుక్షణం కుంగదీస్తునే ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
మీరు జోకులు పేలుస్తారా...?
  తమమీద తామే జోకులు వేసుకుని నవ్వుకోగలిగేవాళ్ళకు ఆత్మవిశ్వాసం అత్యధిక స్థాయిలో ఉంటుందట. తమ మీద ఇతరులు పేల్చే జోకుల్ని తట్టుకోలేని వాళ్ళు ఆత్మ న్యూనతతో బాధపడుతున్నట్టే లెక్క      


ప్రపంచంలో అన్ని బాధలకూ ఆశలు, కోరికలే మూలకారణాలని గౌతమ బుద్దుడు చెప్పింది అక్షరాలా నిజమనుకోవచ్చు. ఒక మనిషి ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుసుకోవడానికి అతను రోజుకు ఎన్నిసార్లు మనస్పూర్తిగా నవ్వుతున్నాడో లెక్క వేస్తే సరిపోతుంది. ఒంటరిగా ఉన్నప్పటికంటే జనంలో ఉన్నప్పుడు మనం 30 రెట్లు ఎక్కువగా నవ్వుతామట.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆడవాళ్ళు మగవాళ్ళకంటే ఎక్కువసార్లు నవ్వుతారట. మనసు దోచుకున్న మగువను నవ్వించడానికి మగవాళ్ళు నానా తంటాలు పడితే, తాము మెచ్చిన మరుడి సన్నిధిలో అతివలు అధికంగా నవ్వులు కురిపిస్తారట. తమమీద తామే జోకులు వేసుకుని నవ్వుకోగలిగేవాళ్ళకు ఆత్మవిశ్వాసం అత్యధిక స్థాయిలో ఉంటుందట. తమ మీద ఇతరులు పేల్చే జోకుల్ని తట్టుకోలేని వాళ్ళు ఆత్మ న్యూనతతో బాధపడుతున్నట్టే లెక్క.

webdunia
WD
పెళ్ళి పేరు చెబితె స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు తిలోదకాలివ్వాల్సి వస్తుందేమో అని భయపడేవాళ్లంతా ఇక హ్యాపీగా సప్తపదికి సై అనవచ్చు. పెళ్ళి తర్వాత కొద్దోగొప్పో ఆనందం పెరుగుతుందే తప్ప తగ్గదని పరిశోధకులు అంటున్నారు.

చేసే ఉద్యోగం కూడా ఓ వ్యక్తి ఆనందాన్ని నిర్ణయించే అంశంలోకే వస్తుంది. స్వేచ్ఛ నిర్ణయాధికారం ఎక్కువగా ఉన్న బాధ్యతలను నిర్వర్తించే ఉద్యోగులు మిగతా వాళ్ళతో పోలిస్తే ఎక్కువ ఆనందంగా ఉన్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి.

మొత్తంగా చూస్తే ఉద్యోగాలు చేసేవాళ్ళకంటే స్వయం ఉపాధి మీద ఆధారపడి బతికే వాళ్ళే 'జీవితమే మధురమూ' అని పాడుకుంటూ ఎక్కువ హాయిగా గడపగలరట. ఉద్యోగం చేసేవారికంటే ఎక్కువ పని చేస్తు వారికంటే తక్కువ సంపాదించినా ఆలస్యంగా రిటైరైనా సంతోషంలో మాత్రం వీరు ఒక అడుగు ముందే ఉంటారట.

ప్రపంచంలో ఏ దేశంలో చూసినా మహిళలకు సమస్యలెక్కువ. అణచివేత, స్వాతంత్ర్యలేమి, అనారోగ్యం వంటి సమస్యల్ని ఎదుర్కుంటూనే ఉన్నప్పటికీ వనితలే మగవాళ్ళకంటే ఆనందంగ ఉన్నారట. ఇరవై నాలుగు గంటలూ టీవీకే అతుక్కుపోయి గడిపేవాళ్ళు శోకదేవతలకు ప్రతిరూపాలట. మితంగా రోజుకు ఒకటో రెండో పెగ్గులు బిగించే మగరాయుళ్ళు మిగతా వారికంటే ఎక్కువ ఆనందాన్ని పొందుతారట.

మొత్తంగా చూస్తే ఇతరులతో కలివిడిగా ఉండే మనస్తత్వం, ఆత్మ విశ్వాసం, ఆశావాదం, సర్దుకుపోయే స్వభావం, పరిస్థితులు మన నియంత్రణలో ఉన్నాయన్న భావన, కోరికలకు పరిమితి లాంటి సద్గుణాలు ఉంటే ఆనందకరమైన వాతావరణం మన చుట్టూ పరిభ్రమిస్తుందని అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు. ఇంతకీ మీరు ఏమాత్రం ఆనందంగా ఉన్నారు...?

Share this Story:

Follow Webdunia telugu