యువతుల సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసేందుకు ఎంతగానో తోడ్పడుతూ వస్తున్న ఫెయిర్ అండ్ లవ్లీ సంస్థ తాను స్థాపించిన ఫౌండేషన్ ద్వారా వారికి అందమైన జీవితాన్ని కూడా ఇవ్వడంలో ముందు పీఠిన ఉంది. సుందరాంగులుగా ర్యాంప్‌లలో మెరిసి పోవాలనే కలలు కనలేకున్నా, జీవితంలో చదువు ద్వారా పైకి రావాలని కలలు కంటూ వాటిని నెరవేర్చుకోవడానికి ఆర్థిక వసతి లేని నిరుపేద కుటుంబాల యువతులకు ఫెయిర్ అండ్ లవ్లీ ఫౌండేషన్ గత అయిదేళ్లుగా స్కాలర్‌షిప్ ఇస్తూ వారి కలలను సాఫల్యం చేస్తోంది.
హిందూస్తాన్ యునిలివర్ లిమిటెడ్ కంపెనీ 2003లో స్థాపించిన ఫెయిర్ అండ్ లవ్లీ ఫౌండేషన్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న యువతుల ఉన్నత చదువుల కోసం స్కాలర్‌షిప్పులను అందజేస్తోంది. చదువులో చురుకుగా ఉన్నా ఆర్థిక పరిస్థితి సహకరించని పేద యువతులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి అవార్డులను ప్రకటిస్తోంది.
అవార్డు పొందిన వారికి గ్రాడ్యుయేషన్, పిజి, డాక్టరేట్ కోర్సులు చదివేందుకు ఆర్థిక సహాయం అందజేస్తోంది. దీంట్లో భాగంగా 2008 సంవత్సర అవార్డులకు గాను దేశవ్యాప్తంగా 128 మంది యువతులను ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసింది. వీరిలో 58 మంది మన రాష్ట్రానికి చెందిన వారే కావడం విశేషం.
వీరిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద గాథ. ఎంపికైన వారిలో ఎక్కువ మంది తమ కుటుంబంలో మొదటి సారిగా డిగ్రీ అందుకున్నవారే. శీతల పానీయాలు అమ్ముకునే వారు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు, చదువుకోవాలంటే రోజూ 50 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసిన వారు, వెల్లింగ్ దుకాణాల్లో పని చేసే వారి కుటుంబాలకు చెందిన వారు. వీరంతా ఆర్థిక సామర్థ్య లేమితో బాధపడుతున్న తమ జీవితాలను మార్చుకోవాలంటే సహాయం చేసే బయటి శక్తుల కంటే తమ చేతులలోనే అంతా ఉందని నమ్మి పోటీలో తీవ్రంగా పోరాడారు.
ఈ సందర్భంగా విజేతలకు స్కాలర్‌షిప్పులు సమర్పించిన సుప్రసిద్ధ నాట్యతార మృణాళినీ సారాబాయ్ మాట్లాడుతూ ఇలాంటి గౌరవనీయమైన లక్ష్యంకోసం ఏర్పర్చిన కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషం కలిగిస్తోందని చెప్పారు. దేశం నలుమూలల నుంచి ఈ ప్రతిభావంత యువతులను కలుసుకోవడం మరపురాని అనుభూతిని కలిగిస్తోందని తెలిపారు. ఈ స్కాలర్‌షిప్ అందుకోవడానికి తాము నిజంగా అర్హులమేనని వీరు భవిష్యత్తులో నిరూపించుకుంటారని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హిందూస్తాన్ యునిలివర్ లిమిటెడ్ స్కిన్ కేర్ కేటగిరీ ఛీఫ్ గోవింద్ రాజన్ మాట్లాడుతూ బాలికలు, మహిళల సాధికారత వేపుగా చేపట్టే మంచి కార్యక్రమాలకు బాసటగా నిలవడంలో తమకు నమ్మకముందని చెప్పారు. మహిళా సాధికారత సాధించాలంటే మొట్టమొదటి అడుగు విద్యేనని చెప్పారు. భారత దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన మహిళలను తమ ఫౌండేషన్ చేరుకోగలిగిందని భారతీయ మహిళల సాధికారతకు తమ సంస్థ కూడా వేదికగా నిలుస్తోందని సగర్వంగా ప్రకటించారు.