మహిళా లోకానికి ఆదర్శమూర్తులు ఆ మహిళామణులు
, మంగళవారం, 8 మార్చి 2011 (13:15 IST)
టాలీవుడ్ సిల్వర్‌స్క్రీన్‌పై గ్రీకువీరుడుగా పేరు తెచ్చుకున్న నటుడు అక్కినేని నాగార్జున సతీమణి అక్కినేని అమల. నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన అమల వివాహానంతరం జంతు సంక్షేమానికి తనవంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆమె చేస్తున్న సేవలకు గాను ప్రత్యేక గుర్తింపు వచ్చింది. జంతు పరిరక్షణకోసం అమల నిరంతరంగా కృషి చేస్తున్నారు. బాలల హక్కుల పరిరక్షణకై నడుం బిగించిన మానవతామూర్తిఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన శాంతాసిన్హా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్‌కు చైర్ పర్సన్. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన శాంతాసిన్హా ఎమ్‌వీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. 1950 జనవరి 7న జన్మించిన శాంత సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్ హైస్కూలులో విద్యాభ్యాసం చేశారు. 1972
సంవత్సరంలో ఉస్మానియాలో పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, 1976లో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. హైదరాబాద్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరిన శాంతా 1981లో ఎమ్‌వీ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఆమె తాతగారైన మామిడిపూడి వెంకటరంగయ్య స్మృత్యర్థం ఎమ్‌వీ ఫౌండేషన్‌ను స్థాపించిన శాంత బాలల హక్కుల పరిరక్షణకోసం విశేషంగా కృషి చేస్తున్నారు. ఆరంభంలో సామాజిక మార్పుకోసం, పేదలకు విద్యనందించే దృక్ఫథంతో ఆరంభించిన ఈ ఫౌండేషన్ 1991 తర్వాత బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం వీధిబాలలకు విద్యాబుద్ధులు చెప్పించింది. ఈ సంస్థలో 80 వేలకు పైగా వాలంటీర్లున్నారంటే ఎంత చురుకుగా తన కార్యకలాపాలను నిర్వహిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఆడపిల్ల పుట్టిందని పెదవి విరిచిన ఆ కుటుంబానికే ఆమె ఆకాశమంత సైనా నెహ్వాల్ పేరు తెలియని వారుండరు. బాడ్మింటన్ ఆటలో ప్రావీణ్య ప్రదర్శనకు ‘ఖేల్‌రత్న’ అవార్డు పొందింది. ప్రపంచ ర్యాంకింగ్‌లో నాలుగవ స్థానం ఆక్రమించిన సైనా ఒలంపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్న తొలి భారతీయ మహిళా క్రీడాకారిణి. ప్రపంచ జూనియర్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణి కూడా ఆమెనే. ఇండోనేషియన్ ఓపెన్ కప్, సింగపూర్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకున్న సైనా నెహ్వాల్ మార్చి 17, 1990న హర్యానాలో జన్మించింది. 1998
లో సైనా నెహ్వాల్ హైదరాబాద్‌లో బాడ్మింటన్ ఆట నేర్చుకోవడం ప్రారంభించింది. ఆ వయసులో రోజూ ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి ఇంటికి 25 కిమీ దూరంవున్న లాల్ బహదూర్ స్టేడియం తండ్రితో చేరుకునేది. రెండు గంటల ప్రాక్టీసు తరువాత ఆమెను స్కూలు దగ్గర దింపేవాడు ఆమె తండ్రి. ఇలా పట్టుదలతో, దీక్షతో బాడ్మింటన్ తప్ప మరో ప్రపంచం లేకుండా నిరంతర సాధనవల్ల సైనా ఈనాడు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన బాడ్మింటన్ క్రీడాకారిణిగా ఎదిగింది. 2002
లో తొలిసారిగా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. 2004లో ఆమెను భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ నుంచి ధన సహాయం లభించింది. 19 ఏళ్లలోపు ఆటగాళ్లు బాడ్మింటన్ పోటీల్లో గెలవడం, ఆసియా బాడ్మింటన్ పోటీలు రెండుసార్లు గెలవడంతో సైనా దేశంలో ఆటలపై మక్కువ కలవారి అభిమానాన్ని పొందింది. 2006
లో ఫిలిప్పీన్స్ ఓపెన్ టోర్నమెంట్ గెలవడంతో సైనా నెహ్వాల్ దేశ ప్రజలందరినీ ఆకర్షించింది. 2010లో మూడు ప్రధాన పోటీలలో విజేతగా నిలవడంతో ప్రపంచంలో అత్యుత్తమ బాడ్మింటన్ క్రీడాకారిణుల జాబితాలోకి చేరింది సైనా నెహ్వాల్. కామన్‌వెల్త్ పోటీలలో స్వర్ణ పతకం గెలుచుకోవడంతో పాటు హావాయ్ సూపర్ సీరీస్‌ను సైతం కైవసం చేసుకున్న సైనా ప్రస్తుతం దేశంలో అత్యుత్తమ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. సైనా జన్మించినపుడు ఆడపిల్ల పుట్టిందని పెదవి విరిచిన కుటుంబ సభ్యులే ఈనాడు సైనా నెహ్వాల్ వల్ల గుర్తింపు పొందుతున్నారు. ఆడపిల్లా? అని ఈసడించే రోజులు కావు. ఆడపిల్ల అని సంబరపడే రోజులు ఇవి అని తన పట్టుదల వల్ల, దీక్షవల్ల, ప్రత్యేక ప్రదర్శనవల్ల నిరూపిస్తోంది సైనా నెహ్వాల్.అన్ని దానాలకన్నా విద్యాదానం మిన్న విద్యాగంధాన్ని పంచి బాలలను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో వి. కోటేశ్వరమ్మ మాంటిస్సోరి కళాశాలను స్థాపించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో సుమారు 130 పాఠశాలలకు పైగా నెలకొల్పిన కోటేశ్వరమ్మ ఇందిరా గాంధీ పురస్కారాన్ని అందుకున్నారు. మాతృభాషను పరిరక్షించడానికి ఆమె ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష మరువరానిదని కోటేశ్వరమ్మ ఏ పాఠశాలకు వెళ్లినా చెపుతారు.