మహిళలు శక్తివంతులైతే పురుషులకు నష్టం లేదు: హమీద్
, బుధవారం, 31 మార్చి 2010 (16:39 IST)
మహిళలు శక్తి సంపన్నులైతే పురుషులకు నష్టం వాటిల్లుతుందని ప్రస్తుతం సమాజంలో అపోహ ఉందని, వారు శక్తి సంపన్నులైతే పురుషులకు ఎలాంటి నష్టం వాటిల్లదని భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అభిప్రాయపడ్డారు. ముంబైలోని ఎస్ఎన్‌డీటీ మహిళా విశ్వవిద్యాలయానికి చెందిన 59వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి హమీద్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన అంశంపై పలువురు తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నారన్నారు. మహిళలు శక్తి సంపన్నురాలైతే పురుషులకు ఎలాంటి నష్టం కలగదని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తే పురుషులు తమ హక్కులు కోల్పోతారని కొందరు ఆవేదన చెందుతున్నారని, ఇది వారి అపోహ మాత్రమేనని ఆయన అన్నారు. మహిళల్లేకుంటే పురుషులు ముందుకు రాణించలేరని ఆయన ఈ సందర్భంగా మహిళల శక్తి సామర్థ్యాలను కొనియాడారు. మహిళామణులు స్వయం శక్తి సంపన్నురాళ్ళని, వారికి తమ జీవితంపై పూర్తి అవగాహన ఉంటుందని ఆయన చెప్పారు. అలాగే పురుషుల భాగస్వామ్యంతోనే మహిళలు తమ జీవితంలో ముందుకు రాణిస్తారని ఆయన తెలిపారు. మహిళలు రాజకీయాలలోకి వచ్చి స్వతంత్రంగా అధికారాన్ని చేజిక్కించుకునే సత్తా వారిలో ఉందని, అధికారంతోపాటు తమ జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో వారికి తెలుసునని ఆయన అన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం, సమాజం సంయుక్తంగా వారికి సంపూర్ణ మద్దతునివ్వాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. మహిళల్లో చైతన్యం తెచ్చేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాలలో మహిళలకు చోటుకల్పిస్తే అందులోని లోటుపాట్లు వారికి తెలియజేయాల్సిన బాధ్యత పురుషులపై ఉందన్నారు. దీంతో సమాజంలో నెలకొన్న లైంగిక భేదభావాలు సమసిపోతాయని, స్త్రీలు కూడూ పురుషులతో సమానంగా రాణించేందుకు చట్టాలు చాలా అవసరమని ఆయన అన్నారు. వారికి అధికారం కల్పిస్తే సమాజం బాగుపడుతుందని ఆయన అన్నారు.