ఈ సంవత్సరం ఓ విదేశీ సెలబ్రిటీ అదరగొట్టే ఎర్రటి చీరను ధరించి దేశీ లుక్‌తో భారతీయులను అలరించింది. ప్రముఖ ఫ్యాషన్ పత్రిక వోగ్ ముఖ చిత్రంలో భారతీయ చీరెలో కన్పించిన విక్టోరియా బెక్‌హామ్ మోడల్ ప్రపంచాన్ని చీరెకట్టుతో ఆకర్షించింది. భారతీయ చీరకట్టు అద్భుతం అంటూ మురిసిపోయిన విక్టోరియా, భవిష్యత్తులో లండన్‌లో కూడా తాను చీరతో దర్శనం ఇస్తానేమోనని ప్రకటించింది.
మాజీ సూపర్ మోడల్ కార్లా బ్రూనీ వివాహం సంవత్సరం పొడవునా వార్తల్లో నిలిచింది. ఏకంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీనే తన వలపు సయ్యాటలతో బంధించిన కార్లా చివరకు అతడినే పెళ్లాడి ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం రేకెత్తించింది. ఆమె పెళ్లికోసం జీన్ పాల్ గౌటియర్ రూపొందించిన వెడ్డింగ్ డ్రెస్ సైతం ఫ్రెంచ్ పతాకశీర్షికలలో నిలిచింది.
గీతాంజలి విషాదం
బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో కలిసి ఒకప్పుడు ర్యాంప్‌పై హొయలు ఒలికించిన మాజీ సూపర్ మోడల్ గీతాంజలి నాగ్‌పాల్ కొన్ని నెలల క్రితం దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ కనిపించి ఫ్యాషన్ ప్రపంచానికి దిగ్భ్రాంతి కల్గించింది. మాదక ద్రవ్యాల సేవనం, మద్యపాన వ్యసనాలకు లోనై మోడల్ జీవితానికి దూరమైన గీతాంజలి చిరిగిపోయిన దుస్తులతో, ఢిల్లీ వీధుల్లో పూట గడుపుకోవడానికి పదిమందినీ అడుక్కుంటూ కనిపించింది.
పూర్వ జీవితంలో భారతీయ నేవీ అధికారి కూతురుగా ఉన్న గీతాంజలి ఢిల్లీలోని మౌంట్ కార్మెల్ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేసి, తర్వాత లేడీ శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. మోడల్‌గా మారకముందు ఆమె వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా తెలియకపోయినా, మోడల్‌గా మారిన తర్వాత ఒత్తిడిని తగ్గించుకోవడానికి మాదకద్రవ్యాల బారినపడిన గీతాంజలి క్రమేణా మోడలింగ్ ఒప్పందాలను ఒక్కటొక్కటిగా కోల్పోనారంభించింది.
ఆమె సెలబ్రిటీ జీవితం దశలవారీగా పతనం చెంది చివరకు ఢిల్లీ వీధుల్లో యాచకురాలిగా రూపాంతరం చెందింది. ఫ్యాషన్ ప్రపంచపు చీకటి కోణానికి గీతాంజలి సంకేతం.
నవోమి హీరోయినిజం
అంతర్జాతీయ సూపర్ మోడల్ నవోమి క్యాంప్‌బెల్ లండన్‌లోని హీత్రో ఎయిర్ పోర్ట్‌లో లగేజీ విషయంలో వివాదం పెట్టుకుని ఓ పోలీసు అధికారి చెంపమీద లాగి కొట్టి అరెస్టయింది. 37 ఏళ్ల నవోమీని విచారణ అనంతరం అర్థరాత్రి వేళ ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేషన్ నుంచి బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చింది.