దుబారా ఖర్చులను అదుపు చేయడంలో మహిళలే...
, సోమవారం, 22 మార్చి 2010 (14:50 IST)
అలంకరణలో అందంగా తయారయ్యేందుకు, విలువైన నగలు, చీరలు ధరించడంలో మహిళలు ఎల్లప్పుడూ ముందుంటారు. అలాంటిది ఇంటి ఖర్చులలో దుబారా ఖర్చులను అదుపు చేసే విషయానికి వస్తే పురుషులకన్నా మహిళలే ముందుండటం గమనార్హం. ఇంటి ఖర్చులను అదుపు చేయడంలో మహిళలు ముందుంటారని ఓ సర్వేలే తేలింది. ఇంటి బడ్జెట్‌ను మహిళలు చాలా చక్కగా రూపొందించుకుంటారని, ఇంటికి కావలసిన సరుకులు, ఇతర వస్తువులను కొనుగోలు చేయడంతోపాటు పనికిమాలిన ఖర్చులను అదుపు చేయడంలో మహిళలు చక్కటి పాత్రను పోషిస్తారని బ్రిటన్‌కు చెందిన ఇడీ బోషర్ ఆఫ్ లవ్లీ మనీ డాట్ కాం తెలిపింది. పనికిమాలిన ఖర్చులకు పురుషులే ఎక్కువగా డబ్బును దుబారా చేస్తుంటారని, కాని మహిళలు మాత్రం దుబారా ఖర్చులను చాలావరకు తగ్గించుకుంటున్నట్లు తమ సర్వేలో తేలినట్లు ఇడీ బోషర్ ఆఫ్ లవ్లీ మనీ డాట్ కాం నిర్వాహకులు తెలిపారు. చాలా వరకు భర్తలు తమ జీతాలను భార్యామణులకు అందజేస్తే అందులోంచి కుటుంబానికి అవసరమయ్యే ఖర్చులు పోగా మిగిలిన సొమ్మును మహిళలు దాచిపెట్టి అవసరానికి వినియోగిస్తుంటారని ఆ సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. పెట్టుబడులు, పొదుపుపై పురుషులు అంతగా పట్టించుకోరు, కాని మహిళలు మాత్రం తమవద్దనున్న డబ్బును చాలా పొదుపుగా వాడుతుంటారు. మహిళలు చాలా ఎక్కువ ఖర్చు చేస్తుంటారని, అత్యంత విలువైన ఆభరణాలు, వస్త్రాలు, జోళ్ళు, అలంకరణ సామగ్రిని కొనుగోలు చేయడంలో డబ్బును నీళ్ళలా ఖర్చు చేస్తుంటారని పురుషులు అపోహపడుతుంటారు. కాని ఇది ఏ మాత్రం వాస్తవం కాదని తమ సర్వేలో తేలినట్లు ఆ సంస్థ వివరించింది.