భారతదేశంలోని వ్యాపార రంగంలో అత్యంత దయార్ద్ర హృదయం కలిగిన వారిలో మహిళామణులే అగ్రగాములుగా ఉన్నారని ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. వీరిలో బయోకాన్స్ ప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈఓ) కిరణ్ మజుమ్దార్-షా, అను ఆఘా, కిరణ్ నాడార్, రోహిణీ నీలేకనిలున్నారు. వీరిని ఈ ఏడాది అత్యంత దయార్ద్ర హృదయం కలిగిన మహిళలుగా ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది.
దేశీయ వ్యాపార, సేవా రంగాలలో ప్రముఖులైన వారిలో ఈ ఏడాది మహిళలే అగ్రగాములుగానున్నారని ఫోర్బ్స్ పత్రిక తెలిపింది. వీరిలో బయోకాన్స్ ప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈఓ) కిరణ్ మజుమ్దార్-షా ఉండగా అనూ ఆఘా 1996 నుంచి 2004 వరకు థెర్మాక్స్ ఛైర్పర్సన్గా వ్యవహరించారు. తన పదవీ కాలం ముగిసిన తర్వాత ఆమె సేవారంగాన్ని ఎంచుకున్నారు. సమాజ సేవలో భాగంగా ఈమె పుణెలో అత్యంత పేదలైన పిల్లల కోసం విద్యాసంస్థలు, వారికి కావలసిన కనీస సౌకర్యాలను అందించేందుకు వివిధ ప్రాంతాలలో సేవా సంస్థలను స్థాపించారు. దీంతోపాటు ఆమె ఇతర సేవా సంస్థలకు కూడా తన మద్దతునిస్తుంటారు. అలాగే ఆమె ఛైర్పర్సన్గా కొనసాగిన థెర్మాక్స్ ఇండియా సంస్థ తన సమాజసేవా కార్యక్రమాలకుగాను సంస్థ ఆదాయంలోనుంచి ఒక శాతం సేవా సంఘాలకు విరాళాలుగా అందజేస్తుంటారు.
అలాగే దేశీయ ఐటీ రంగంలో అగ్రగామిగానున్న ప్రముఖ ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ సంస్థ ఉప వ్యవస్థాపకుడైనటువంటి శివ నాడార్ సతీమణి కిరణ్ నాడార్. ఈమె ఎస్ఎస్ఎన్ సంస్థలు, విద్యాజ్ఞాన్ ద్వారా ఒక శక్తి రూపాన్ని మరో శక్తి రూపంలోకి మార్చే విద్య(ట్రాన్స్ఫార్మేషనల్)ను అందిస్తున్నారు. వీటితోపాటు ఆమె శివ నాడార్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించేందుకు సంకల్పించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ముస్లిం అమ్మాయిలకు విద్యనందించే రాజీవ్ గాందీ ఫౌండేషన్లో కిరణ్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఈమెను అత్యంత దయార్ద్ర హృదయం కలిగిన మహిళగా ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది.
దేశీయ ఐటీ రంగంలో అగ్రగామిగానున్న ఇన్ఫోసిస్ ఉప వ్యవస్థాపకుడైన నాదాన్ నీలేకని సతీమణి రోహిణీ నీలేకని దేశంలోని పలు సాంఘిక సేవా సంస్థలకు చేయూతనందిస్తున్నారు. ఈమె ఇప్పటి వరకు పలు సేవా సంస్థలకు తన వంతు సహాయంగా దాదాపు నలభై మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. ఈ విరాళాలు విద్య, మైక్రో ఫైనాన్స్, ఆరోగ్య భద్రత, పర్యావరణ పరిరక్షణలకు వినియోగించే సేవా సంస్థలకు ఆమె విరాళాలు ఇచ్చినట్లు ఫోర్బ్స్ పత్రిక తెలిపింది.
రోహిణీ నీలేకని అక్షరా ఫౌండేషన్లో 2000 నుంచి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈమె అర్ఘ్యం సేవా సంస్థ వ్యవస్థాపక ఛైర్పర్సన్గాను వ్యవహరిస్తున్నారని ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. పర్యావరణ పరిరక్షణ, సమాజసేవ, విద్య, ఆరోగ్య పరిరక్షణ, సభ్యత-సంస్కృతి, శాస్త్ర సాంకేతిక రంగాలలో పలు సేవలను అందిస్తున్న వారిని తమ పత్రిక ఎన్నుకుందని ఫోర్బ్స్ పత్రిక వివరించింది.