కవలలకు జన్మనిచ్చిన వృద్ధ మహిళ!
కేరళ రాష్ట్రంలోని కొళ్ళం జిల్లాలో నివసిస్తున్న 58సంవత్సరాల వయసు కలిగిన రేమాదేవీ అనే మహిళ ఐవీఎఫ్ టెక్నాలజీ సహకారంతో కవలలకు జన్మనిచ్చింది. విశేషమేంటంటే... ప్రస్తుతం దేశంలో ముదుసలి వయసులో కవలల్ని కన్న తల్లిగా ఆమె చరిత్రకెక్కింది. ఈ వయసులో తనకు కవల పిల్లలు పుట్టడం భగవదనుగ్రహమని రేమాదేవీ అన్నారు. దీంతో తమ జన్మ ధన్యమైనట్లు ఆమె, ఆమె భర్త మురళీధరన్‌లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తాను కలలోకూడా అనుకోలేదని, ఈ వయసులో తను తల్లినయ్యే కోరిక తీరుతుందనేది తనకు అనుమానంగానే ఉండిందని, ఇప్పుడు తనకు ఆ కోరిక తీరిపోయిందని, ఇదంతాకూడా దేవుని కృపవల్లనే జరిగిందని ఆమె ఆనందం వెలిబుచ్చారు. ఇదివరకుకూడా తాను చాలాసార్లు గర్భం ధరించానని, కాని వైద్యుల సలహాలతోపాటు సరైన విశ్రాంతి లభించకపోవడంతో తనకు గర్భస్రావం జరిగేదని దీంతో పిల్లలను కనలేకపోయానని మనోవేదన ఉండేదని, కాని ఈసారి తామిరువురము ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహాలనుపాటించి కవలలకు జన్మనిచ్చి తల్లినయ్యానని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తను తండ్రినయ్యనన్న ఆనందానికి మాటలు రావడంలేదని మురళీధరన్ అన్నారు. ఐవీఎఫ్ అనే చికిత్సాపద్ధతి ద్వారా తన శ్రీమతికి ఇది మూడవసారి ప్రయోగమని, ఈ ప్రయోగంలో ఫలితం దక్కిందని అదికూడా ఏకంగా ఇద్దరు పిల్లలు పుట్టడం తనకెంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.