భారతీయ కార్పొరేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ పగ్గాలు భారతీయ మహిళ చందా కొచర్ చేతిలోకి వచ్చాయి. కంపెనీ సీఈఓగా, మేనేజింగ్ డైరెక్టర్‌గా చందా కొచర్ పేరును ఐసిఐసిఐ బ్యాంకు శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుత సిఇఓ కెవి కామత్ ఏప్రిల్ 30న పదవీ విరమణ చేస్తున్నందున ఆయన స్థానంలో కొచర్ 2009 మే 1 నుంచి ఈ అత్యున్నత పదవిని చేపట్టనున్నారు.
ప్రస్తుతం ఐసిఐసిఐ బ్యాంకు సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్‌గా, గ్రూప్ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఉన్న చందా కొచర్ 1984లో మేనేజ్‌మెంట్ ట్రెయినీగా మొదటిసారిగా ఐసిఐసిఐలో చేరారు. వాణిజ్య బ్యాంకింగ్ కార్యకలాపాలలో ప్రవేశించాలని సంస్థ 1993లో నిర్ణయించినప్పుడు ఈమె కోర్ టీమ్‌తో పాటు ఐసిఐసిఐ బ్యాంక్‌కు మారారు.
ఐసిఐసిఐ బ్యాంకును రిటైల్ బిజినెస్ వైపు మళ్లించడంలో చందా కొచర్ కీలక పాత్ర వహించారు. 2001లో ఈమె రిటైల్ బిజినెస్ పనులకు నేతృత్వం వహిస్తూ ఐసిఐసిఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2006 ఏప్రిల్‌లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆమె నియమితులయ్యారు.
మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరిన సంస్థలోనే పాతికేళ్ల ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగి సంస్థ ఎండీగా, సీఈఓగా ఎదిగిన అరుదైన చరిత్ర ఈమెది. చదువుకునే రోజుల్లో ఒకనాటికి ఇలాంటి అత్యున్నత స్థానానికి చేరుకోగలగని ఆమె కలలో కూడా అనుకోలేదు. చదువులో ఎంతో చురుకైన చందా కొచర్ మేనేజ్‌మెంట్ స్టడీస్, కాస్ట్ అకౌంటెన్సీలో స్వర్ణ పతకాలు సాధించడం గమనార్హం. కాలేజీ రోజుల్లోనే మంచి వక్తగా పేరొందిన కొచర్ పలు వక్తృత్వ పోటీల్లో పాల్గొని అవార్డులు పొందారు.
పదిమందిలో ధారాళంగా మాట్లాడి అందర్నీ ఒప్పించిడంలో చందాకు ఉన్న నేర్పు ఐసిఐసీఐ బ్యాంకు ఉద్యోగిగా వృత్తిజీవితంలో ఎదిగేందుకు తోడ్పడింది. ఉన్నతస్థాయిలో జరిగే కీలక చర్చలలో ఈమె సమర్థవంతంగా మాట్లాడి ప్రధాన నిర్ణయాలో తన ముద్ర ఉండేలా చూసుకునేవారు.
రాజస్తాన్‌లోని జోథ్‌పూర్‌కు చెందిన చందా కొచర్ మేనేజ్‌మెంట్ స్టడీస్, కాస్ట్ ఆకౌంటెన్సీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన తర్వాత1984లో ఐసిఐసిఐ సంస్థలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేర్చారు. మొదట్లో ఇండస్ట్రియల్ పైనాన్స్ కంపెనీగా మాత్రమే ఉన్న ఐసిఐసిఐ 1993లో వ్యాణిజ్య బ్యాంకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు కొచర్‌ను బ్యాంకు విభాగానికి డిప్యూట్ చేశారు.
అప్పటినుంచి ఐసిఐసిఐ బ్యాంక్ గణనీయంగా అభివృద్ధి చెందడంలో చంద్రాదే కీలకపాత్ర. ఈమె ఆధ్వర్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్‌ను మొదలెట్టిన అయిదేళ్లకే దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా ఐసిఐసిఐ ఆవిర్భవించింది. కార్లు, టూవీలర్ రుణాలు, హోమ్ లోన్లు, క్రెడిట్ కార్డుల వ్యాపారం వంటి విభాగాల్లో బ్యాంకు దేశంలో ఈ నాటికీ నెంబర్ వన్‌గా ఉంది.
రెండు నెలల క్రితం బ్యాంకు సామర్థ్యంపై వదంతులు తలెత్తినప్పుడు కడా పరిస్థితిని చక్కదిద్దడంలో కొచర్ ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించారు. 2007లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారంలో శక్తివంతమైన మహిళల్లో కొచర్‌కు ఫార్చ్యూన్ మ్యాగజైనే 33వ ర్యాంకు ఇచ్చింది.
ఐసిఐసిఐ ప్రస్తుతం ఎండీ, సీఈఓ కేవీ కామత్ స్థానాన్ని పూరించనున్న చందా కొచర్ 2009 మే 1 నుంచి 2014 మార్చి 31 వరకు సంస్థ నూతన సీఈఓ పదవిలో కొనసాగనున్నారు.
అత్యున్నత పదవికి ఎంపిక చేస్తూ తనపై సంస్థ చూపిన విశ్వాసానికి చందా కొచర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇన్నాళ్లుగా స్పూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందించిన కామత్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మన ముందున్న అవకాశాలను అందిపుచ్చుకునేలా ఐసిఐసిఐ గ్రూప్ బలాన్ని పెంచే దిశగా టీమ్‌తో, స్టాక్ హోల్డర్లతో తాను కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా ఆమె ప్రతిజ్ఞ చేశారు.
ప్రపంచంలో అత్యంత శక్తివంతులైన వ్యాపార మహిళలకు సంబంధించి ఫార్చ్యూన్ మేగజైన్ వార్షిక జాబితాలో చందా కొచార్ పేరు తరచుగా కనిపిస్తుండటం ఆమె సాధించిన విజయాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇంద్రనూయి పెప్సీకో సంస్థ సీఈఓగా భారతీయ మహిళల ప్రాభవాన్ని పాశ్చాత్యదేశాల్లో చాటితే, భారతీయ కార్పొరేట్ సంస్థ ఐసిఐసిఐ బ్యాంక్ సీఈఓగా కొచార్ నియామకం భారతీయ మహిళల విజయాన్ని మరింతగా ఎలుగెత్తి చాటింది.
అగ్రస్థానానికి చేరుకోవాలని చిన్నతనంలోనే కొందరు కలగంటారు. అయితే అలాంటి స్వప్నాలేవీ లేకుండానే కేవలం విశేష ప్రతిభా పాటవాలతో అంచెలంచెలుగా ఉన్నత స్థానానికి చేరుకున్న విశిష్ట వ్యక్తులలో చందా కొచర్ ఒకరు.