ఐక్యరాజ్య సమితి దూతగా పేద దేశాల్లో పర్యటించినా, ప్రపంచంలోనే అత్యంత సెక్సీ మహిళగా ఖ్యాతి గడించినా, హాలివుడ్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టినా, పేద పిల్లలను దత్తత తీసుకున్నా... ఇలా ఏ విషయంలోనైనా సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచేది ఒకే ఒక్కరే.. ఆమే హాలీవుడ్ అందాల నటి ఏంజెలీనా జోలీ.
శృంగార తారగా ప్రపంచమంతా భావించే ఏంజెలీనా అనాధ పిల్లలను దత్తత తీసుకుని, వారికి ఓ మంచి జీవితాన్ని అందిస్తూ, మానవత్వానికి మారుపేరుగా నిలుస్తోందని, ఆమె నడిచే ఈ దారిలోనే తాను కూడా సాగిపోతానని ప్రముఖ సింగర్ లియోనా లెవీస్ అంటోంది.
"ది మిర్రర్" పత్రిక కథనం ప్రకారం... పేద పిల్లలను దత్తత చేసుకుని అమ్మతనానికే ఆదర్శంగా నిలుస్తోన్న ఏంజెలీనా మాదిరిగానే తాను కూడా తప్పకుండా పేద పిల్లలను దత్తత చేసుకుంటానని లెవీస్ పేర్కొంటోంది.
తన తల్లి ఒక సామాజిక కార్యకర్త అనీ, తండ్రి యూత్ అఫెండర్ ఆఫీసర్ అనీ చెప్పిన లెవీస్... తనకు చాలామంది అనాధ పిల్లలు తెలుసని, వారిని దత్తత తీసుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇందులో భాగంగా లెవీస్ సౌత్ ఆఫ్రికాను కూడా పర్యటించనున్నట్లు పై పత్రిక కథనం తెలిపింది.
"తాను ఆఫ్రికా ఉండేటప్పుడు చాలామంది పిల్లలను తీసుకెళ్లి ఆడుకునేదాన్నని, వాళ్ళంతా చాలా అందంగా ఉండేవారని, అయితే వారికి హెచ్ఐవీ సోకినందువల్ల అనాధలుగా మిగిలిపోయారని... వారిని తల్చుకుంటే హృదయం ద్రవించుకుపోయేదని..." లెవిస్ చిన్నప్పటి జ్ఞాపకాలను కూడా నెమరువేసుకున్నట్లు మిర్రర్ వెల్లడించింది.
అసహాయ స్థితిలో చాలామంది చిన్నారులు లండన్‌లోనూ, ఇతర విదేశాల్లోనూ ఉన్నారని... అలాంటి వారిని చెంతకు చేరదీసి వారికో చక్కటి జీవితాన్ని అందించాల్సిన బాధ్యత వ్యక్తులుగా ప్రతి ఒక్కరికీ ఉందని చెబుతోంది లెవీనా. తన పాటతో వేలాదిమందిని మంత్రముగ్ధులను చేయగలిగే ఈ చిన్నది.. అనాధ పిల్లలపై కనబరుస్తున్న ప్రేమ... అమ్మతనానికి ఓ సరికొత్త గొప్పదనాన్ని ఆపాదించేదిగా ఉందనటంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.