ఆడశిశువుల హత్యలను నిరసిస్తూ, వారిని కాపాడాల్సిన బాధ్యత సమాజానిదేనన్న సందేశంతో ప్రసిద్ధ గాయని సునీతరావు "వక్త్" పేరిట ఓ కొత్త ఆల్బమ్ రూపొందించారు. దీనికి సంబంధించి ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యుఎన్ఎఫ్‌పిఎ) ఢిల్లీలోని హోటల్ ప్యాలెస్ హైట్స్‌లో, మీడియా ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా యుఎన్ఎఫ్‌పిఎ అధికారిక ప్రతినిధి మరియు గాయని అయిన సునీత మాట్లాడుతూ... తమ సంస్థ ఆడశిశువుల సంక్షేమాన్ని కోరుతూ చేపట్టిన ప్రచారంలో భాగంగా వక్త్ ఆల్బమ్ రూపొందిందని చెప్పారు. ఈ ఆల్బమ్ ముఖ్యంగా తమకు ఆడపిల్లలు వద్దు అనే భావజాలంతో ఉన్న ప్రజల కళ్లు తెరిపిస్తుందని తెలిపారు.మమ్మల్నీ బ్రతకనివ్వండి....! |
|
పాట, భావం, ధ్వని, సంగీతం, ఆహార్యం మొత్తంగా పాప్ మయమై శబ్దకాలుష్యం పేరుకుపోతున్న ఈ రోజుల్లో ఆడ మగ సమానమే అనే సందేశానికి భావోద్వేగాలను జతచేసి సునీతారావు రూపొందించిన వక్త్ ఆల్బమ్ మండువేసవిలో మలయ మారుతాన్ని తలపిస్తోంది... |
|
|
ఈ వీడియో ఆల్బమ్‌లోని మొదటి పాట "సున్ జరా"ను ఆడపిల్లలందరికీ అంకితం చేయబడిందని సునీత చెప్పారు. వక్త్‌ను రూపొందించటంలో యుఎన్ఎఫ్‌పిఎ చేసిన సహాయానికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. యుఎన్ఎఫ్‌పిఎ నుండి ఈ సమావేశానికి హాజరైన మరో మహిళ ఇనా మాట్లాడుతూ.... పిల్లల పుట్టుకలో ఆడా, మగా ఎంపికను పట్టి పట్టి చూస్తున్న వారి కళ్లు తెరిపించే సందేశాన్ని ఇచ్చేలా తాము ఈ వినోదాత్మక పద్ధతిని ఎన్నుకున్నామని చెప్పారు.
పెయింటింగ్, ఆర్ట్, గజల్, మ్యూజిక్‌ల కంటే తాము రూపొందించిన ఈ వీడియో ఆల్బమ్ ఎక్కువమందిని ఆలోచింపజేసేదిగా ఉంటుందని, అందుకే దీన్ని ఎంచుకున్నామని సునీత వెల్లడించారు. ఈ ఆల్బమ్ సంగీతపరంగా హిట్ అవుతుందా లేదా అని తాము ఆలోచించలేదని, ఇది ఎక్కువమందిని ఆలోచింపజేస్తే చాలని ఆమె అన్నారు.
గాయనీ గాయకులుగానీ, నటీనటులుగానీ సామాజిక సందేశాలను ప్రచారం చేసేలా ఉండాలని చెప్పిన సునీత తాను గతంలో రూపొందించిన "ధాన్" అనే పాటలో ధూమపానం గురించి తడిమానని చెప్పారు. ప్రజలు ఎప్పుడూ మంచి సంగీతాన్ని ఇష్టపడతారు. మంచి సంగీతం ఎప్పుడూ వారి మనస్సులలో నిలిచిపోతుంది. మంచి సంగీతం ఎప్పుడూ జీవితంలో మంచి మార్పును తీసుకొస్తుందని కూడా సునీత చెప్పారు.
ఆడపిల్లల రక్షణ అనే సామాజిక సందేశాన్ని "సున్ జరా" పాట అందిస్తోందని సునీత చెప్పారు. ఆడపిల్లలను వద్దనుకుంటూ, వారి పుట్టుకను వ్యతిరేకించడం వల్ల రాను రాను జనాభా నిష్పత్తిలో మహిళల శాతం తగ్గిపోయి, సామాజిక అసమతౌల్యం ఏర్పడే ప్రమాదం ఉందనే సారాంశంతో ఇది రూపొందిందని సునీత తెలిపారు.
ఇక ఇనా మాట్లాడుతూ... ఎంత తక్కువమంది అమ్మాయిలు ఉంటే, అంత మంచిదని... ప్రజలు అనుకుంటున్నారని, అది చాలా తప్పుడు అభిప్రాయమని ఆమె చెప్పారు. అమ్మాయిల శాతం తక్కువ అవడం వల్ల సమాజంలో మహిళలకు వ్యతిరేకంగా హింస, అత్యాచారాలు, అపహరణలు, అక్రమ రవాణా (వ్యభిచారం) లాంటివి పెరిగిపోతాయని ఆమె హెచ్చరించారు.
కాబట్టి, తాము ముఖ్యంగా ఆడ, మగ సమానమేనన్న భావాన్ని ఈ ఆల్బమ్ ద్వారా చెప్పదలచామని అన్నారు. దీని ముఖ్య ఉద్దేశ్యం ఆడశిశువులకు సమానత్వం ఇవ్వాలని, అందుకు చట్టం ఒక్కటే పని చేస్తే సరిపోదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, ప్రతి ఒక్కరి మనస్సులలోనూ మార్పు రావాలని అనా అభిప్రాయపడ్డారు.
ఈ వక్త్ ఆల్బమ్ సునీత రూపొందించిన ఐదవ సోలో ఆల్బమ్ కాగా, ఇందులో 8 రకాల ట్యూన్స్ ఉంటాయి. ఇవి "రాగా బేస్"లో రూపొందిన సమకాలీన పాటలు కాగా, వీటిని స్వయంగా సునీతే రచించారు. ఈ ఆల్బమ్ రూపొందడంలో జినో బ్యాంక్స్, సంగీత్ హల్దీపూర్ మరియు షెల్డన్ డిసిల్వా సారథ్యంలోని "నెక్సస్" సహాయ సహకారాలను అందించింది, మూడు పాటలకు డీజే గౌరవ్ ఇస్సార్ ట్రాక్ రూపొదించారు.
"గడచిన కాలాన్ని ఒకసారి తరచి చూస్తే చాలా వేగంగా ముగిసిపోయినట్లు, ప్రస్తుత కాలం చాలా మందకొడిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. అయితే కాలం మాత్రం ఎప్పటికీ ఆగదు. కాబట్టి జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని, ఆనందంగా జీవించాలన్న" సందేశాన్ని వక్త్ ఆల్బమ్ ఇస్తుంది.
ఎనిమిది పాటలు కలిగిన ఈ వక్త్ ఆల్బమ్‌లో "జీవితానికి సలాం చేయి... కాలానికి మనందరం దాసులం" అనే ఉమ్మడి సారాంశం దాగి ఉంది. ఈ వక్త్ ఆల్బమ్‌లోని ఒక పాట పంజాబీ పాప్ స్టయిల్‌లో రూపొందిందని, అందులో ఒక భారతీయ బాలిక అందాలను వర్ణిస్తూ తుంబ్రీ రాగంలో రూపొందించామని సునీత చెప్పారు.
సామాజిక సందేశంతో రూపొందిన ఈ వక్త్ ఆల్బమ్‌ను విజయవంతం చేయాలని సునీత ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తనకు పరిచయమైన వ్యక్తులందరూ తన జీవితాన్ని పరిపూర్ణం చేశారని, ప్రతిక్షణం తన జీవితాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తున్నానని ఆమె ఉద్విగ్నంగా చెప్పారు.