తెల్లదొరలకు సింహ స్వప్నం ఆ మహిళా కెరటం
ఉత్తరాదిలోని ఝాన్సీకి రాణి అయిన లక్ష్మీభాయ్ 1857 స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ అధికారుల అరాచకాలను ఆటకట్టించటానికి నడుం బిగించిన వీరవనిత. యుద్ధరంగంలో తొలివిజయాన్ని సాధించి భారతీయులందరికీ ఆదర్శప్రాయంగా, స్ఫూర్తినిస్తూ 21 సంవత్సరాల ప్రాయంలో సైన్యంకంటే ముందుగా యుద్ధరంగంలోకి చొచ్చుకుపోతూ శత్రువును చావుదెబ్బ తీసిన ధీశాలి ఝాన్సీరాణి.
1828వ సంవత్సరంలో కాశీలో జన్మించిన ఝాన్సీరాణి చిన్ననాడే గుర్రపుస్వారీ, షూటింగ్ వంటి విద్యలను అభ్యసించింది. బాల్యంలో మణికర్ణికగా పిలవబడిన ఝాన్సీరాణి తన నాలుగో ఏటనే తల్లిని కోల్పోయింది. ఇలా ఆమె భారం పూర్తిగా తండ్రిపై పడింది. చిన్ననాటినుంచే తండ్రి ఆమెను ధీరవనితగా తీర్చిదిద్దారు.
1842లో ఝాన్సీకి రాజైన రాజా గంగాధర రావు నెవాల్కర్‌ను వివాహమాడిన ఝాన్సీ... ఝాన్సీకి రాణి కావటంతోపాటు ఝాన్సీ లక్ష్మీభాయ్‌గా పిలవబడింది. 1853లో భర్త మహరాజా గంగాధర రావు తీవ్ర అనారోగ్యంపాలై నవంబరు 23న మరణించాడు.
దీనితో ఝాన్సీ రాజ్యాన్ని తమకు అప్పగించాలని బ్రిటిష్ పాలకులు ఝాన్సీరాణిని కోరారు. అయితే దీనికి లక్ష్మీభాయ్ అంగీకరించలేదు. దీంతో ఝాన్సీరాణిని అణచివేసేందుకు అనేక ఎత్తుగడలు వేసింది నాటి బ్రిటిష్ ప్రభుత్వం. అరాచకాలు సృష్టించింది. వారిని ఎదుర్కొనేందుకు తన రాజ్యంలో సైనికులను తయారుచేసింది ఝాన్సీ రాణి. బ్రిటిష్ వారిపై తిరగబడింది. తన సత్తాను చూపింది.
ఝాన్సీరాణి దాడికి తాళలేని తెల్లదొరలు, 1858 జనవరిలో బ్రిటిష్ సైనిక దళాన్ని ఝాన్సీపైకి పంపింది. దాదాపు రెండు వారాల హోరాహోరీ యుద్ధం అనంతరం ఝాన్సీ రాజ్యాన్ని తమ వశం చేసుకున్నది. అయితే ఝాన్సీ రాణి అక్కడ నుంచి అత్యంత చాకచక్యంగా తప్పించుకుని తాంతియా తోపే వర్గంలో కలిసింది. ఆ తర్వాత మళ్లీ బ్రిటిష్ పాలకులపై విరుచుకుపడింది.
అయితే దురదృష్టవశాత్తూ 1858 జూన్ 17న శత్రు సేనలకు చిక్కింది. సైనికులు ఆమెపై కాల్పులు జరిపారు. వారు మరింత సమీపించటంతో వేరే గత్యంతరం లేక తనకు మాత్రమే తెలిసిన ఓ ప్రదేశంలోకి దూకేసింది. ఆమెను ఆ పరిస్థితిలో చూసిన ఓ బ్రాహ్మణుడు ఆమెను రక్షించాలని శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఝాన్సీ తన ఊపిరి వదిలేముందు చివరిసారిగా అన్న మాటలు "జై హింద్".
రాజ్యాలు కోల్పోయిన భారత సంస్థానాధీశుల స్వాతంత్ర్యం కోసం యుద్ధం ప్రారంభమయినప్పుడు దత్తబిడ్డను వీపుకు కట్టుకొని కత్తిబట్టుకొని కదనరంగంలోకి దూకి వీరమరణం పొందిన ఝాన్సీరాణి మరణించిన రోజు 1858 జూన్ 17 అని ఎందరు భారతీయులకు తెలుసు?