అమ్మాయిలు ఎలాంటి భాగస్వామిని కోరుకుంటున్నారంటే..?!
, శుక్రవారం, 19 మార్చి 2010 (17:59 IST)
ప్రతి అమ్మాయి తన జీవిత భాగస్వామి అందంగా ఉండాలని కలలు కంటూ ఉంటుంది. అందంతోపాటు అతని చదువు, ఆదాయం, వ్యక్తిగత గుణాలు, మంచి అలవాట్లు కలిగిన వాడైతేనే ఇష్టపడుతున్నారు నేటి అమ్మాయిలు. * ఆమెకు కాబోయే జీవిత భాగస్వామి పిసినారిగా, పిరికిపందలా ఉండకూడదని కోరుకుంటుంటారు. పిసినారి భర్తతో తన కోరికలు నెరవేరవని నేటి అమ్మాయిలు భావిస్తున్నారు. * మంచి ఆదాయపరుడైన వరుడు తనకు జీవిత భాగస్వామిగా లభించాలని కోరుకుంటోంది. స్త్రీ తెచ్చే ఆదాయంపై ఆధారపడే పురుషులంటే ఏ అమ్మాయి కూడా ఇష్టపడదని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి అబ్బాయిలతో తస్మాత్ జాగ్రత్త. * చాలా మంది అమ్మాయిలు తనకు కాబోయే భర్త తనకన్నా గొప్పగా చదివి వుండాలి, మంచి తెలివిపరుడై ఉండాలి. అందరికన్నా యోగ్యుడై ఉండాలని కోరుకుంటున్నారు. * తల్లిదండ్రుల ఆదాయంపై ఆధారపడి జీవించే అబ్బాయిలంటే అమ్మాయిలు మొహం చాటేస్తున్నారు. స్వతహాగా ఆదాయపరులై ఉండే అబ్బాయిలనే తమ జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నారు. * తమ ఆలోచనలను పదిమందితో పంచుకునే వాడుగా అబ్బాయి వుండాలి, పదిమందికి ఆదర్శప్రాయుడై ఉండాలి. సంకుచిత స్వభావం కలిగిన వారంటే అమ్మాయిలు అస్సలు ఇష్టపడరు. అలాగే అమ్మాయిల ఆలోచనలను గౌరవించేవారంటే మరీ ఇష్టపడుతుంటారు. * తనకు కాబోయే జీవిత భాగస్వామి కేవలం తన భర్తగానే కాకుండా తనకు మంచి మిత్రునిగా కూడా వ్యవహరించేలా ఉండాలని అమ్మాయిలు కోరుకుంటున్నారు. సుఖదుఃఖాలలో, కష్టనష్టాలలో, సంతోషంలో తనతో పాలుపంచుకునే వాడినే తన జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నారు నేటి అమ్మాయిలు. * తనకు కాబోయే జీవిత భాగస్వామి కనుసన్నల్లో జీవించాలని నేటి అమ్మాయిలు కోరుకోవడం లేదు. అలాగే ఇతరులు చెప్పే చెప్పుడు మాటలతో తన జీవితాన్ని నరకప్రాయం చేసుకునేవారంటే అస్సలు ఇష్టపడటం లేదు. ఇలాంటి వారు జీవిత భాగస్వామిని సుఖపెట్టలేరని అమ్మాయిల అభిప్రాయంగా ఉంది. * సుగుణాల రాముడు, సుసంపన్నుడైతేనే ఇష్టపడుతున్నారు నేటి అమ్మాయిలు. దురలవాట్లున్న వ్యక్తి తన జీవిత భాగస్వామిని సరిగా చూసుకోలేడని అమ్మాయిలు బలంగా నమ్ముతున్నారు. * పదిమందిలో స్త్రీలపట్ల గౌరవ భావం చూపగలిగిన వాడినే చాలామంది అమ్మాయిలు కోరుకుంటుంటారు. స్త్రీలంటే కాళ్ళక్రింద చెప్పులుగా చాలా మంది భావిస్తుంటారు, అలాంటి మగవారిని తమ జీవిత భాగస్వామిగా అమ్మాయిలు ససేమిరా అంగీకరించరు.* తనంటే ప్రేమ, గౌరవం, అభిమానం పంచేవాడైతేనే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. వివాహమైన తర్వాత తన జీవిత భాగస్వామి తనను ఒంటరి జీవితాన్ని గడిపేలా చేసేస్తే మరి అలాంటి వివాహం ఎందుకు అని వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా వివాహం చేసుకుని చాలామంది అబ్బాయిలు విదేశాల్లో ఉద్యోగాలు వెలగబెడుతుంటారు. అంటే.. అమ్మాయిని అమ్మగారింట్లోనో లేక అత్తగారింట్లోనో వదిలేసి వీరు మాత్రం విదేశాలలో బ్యాచిలర్‌గా ఫోజులు కొడుతూ జీవిస్తుంటారు. ఇది కూడా ఒక జీవితమేనా అని ప్రశ్నిస్తున్నారు నేటి అమ్మాయిలు.