Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మ గురించి ఆలోచించండి..

Advertiesment
అమ్మ గురించి ఆలోచించండి..

జ్యోతి వలబోజు

WD
కార్యేషు దాసి
కరణేషు మంత్రి
భోజ్యేషు మాతా
శయనేషు రంభ…

ఇలా ఉండాలని ప్రతి అమ్మాయికి నేర్పిస్తారు. ప్రతి ఆడపిల్ల పెళ్ళికాకముందు హాయిగా చీకూ చింతా లేకుండా, చదువు , స్నేహితులతో సరదాగా ఉంటుంది. కాని పెళ్ళి కాగానే అమ్మలా మారుతుంది. లేదా మారడానికి ప్రయత్నం మొదలు పెడుతుంది. ఒక కుటుంబాన్ని తనదిగా భావించి మరో తరాన్ని సృష్టించి, ముందుకు నడిపించే పెద్దరికం నెత్తిన వేసుకుంటుంది స్త్రీ. అత్తవారింటికొచ్చాక ఆమెపై కొత్తగా ఆంక్షలను విధించడం కూడా జరుగుతుంటుంది. ఐనా అనుభవం మీద ఒక్కటొక్కటిగా భర్త సహకారంతో నేర్చుకుంటుంది.

అత్తమామలకు, భర్త, పిల్లలకు కావలసినవి అమర్చి పెట్టడం, బంధువులతో మర్యాదగా ఉండడం... ఇలా ఎన్నో బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చడంకోసం సతమతమవుతుంది. ఇంత శ్రమ పడుతున్న అమ్మకు కొన్ని కోరికలు, ఆశలు ఉంటాయని ఎవరైనా ఆలోచిస్తారా? చిన్న చిన్న కోరికలను సైతం తీర్చుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో అమ్మలుంటున్నారనడానికి ఈ చిన్ని ఉదాహరణ చాలు. తమ కాలనీలో చీరలమ్మేవాడు వస్తే... ఉద్యోగిణులు మాత్రం స్వతంత్రించి చీరలు కొనుక్కోగలరు. తను ఉద్యోగం చేయట్లేదు... కనుక ఆమె కొనలేని దయనీయ పరిస్థితి

ఆమె అనుకుంటే... ఇంటి ఖర్చులకోసం భర్త ఇచ్చిన డబ్బుల నుంచి కొనుక్కోవచ్చు. కాని అది తన స్వంతం కాదు. ఖర్చు చేస్తే దానికి లెక్క చెప్పాలి. లేదా భర్తను అడగాలి. అందరికి అన్నీ అమర్చి పెడుతున్నా... తనకంటూ స్వంత డబ్బుఉండదు. ఖర్చు పెట్టాలనుకున్న డబ్బు... భర్తదో, కొడుకుదో, కూతురిదో అవుతుంది. వాళ్ళు ఇస్తేనే తప్ప తనకిష్టమైనవి కొనుక్కోలేని స్థితి. ఇంటి పనులన్నీ చేసి ఉద్యోగం కూడా చేయాలంటే కష్టం.
అమ్మ ఇంటి పని చేయడానికేనా...?
  ప్రతి చిన్నదానికి స్త్రీలో ఎందుకు తప్పులు ఎత్తి చూపుతారు? అంటే భార్య(అమ్మ ) ఉన్నది ఇంటిపని చేయడానికేనా...? పెళ్ళి అయినప్పటినుండి కుటుంబం కోసం ఎంతో కష్టపడుతుంది... ఆమె ఇష్టాయిష్టాల గురించి ఒక్కసారైనా ఆలోచించారా...?      


పెళ్ళై , పిల్లలు... వాళ్ళ పెంపకం, చదువులు,ఉద్యోగాలు, వారి పెళ్ళిల్లు... ఇలా బాధ్యతలు పెరుతూనే ఉంటాయి. ఈ పరిణామంలో తన ఉనికినే కోల్పోతుంది స్త్రీ. తనకు ఏది ఇష్టం, ఏది తనకు నిజమైన సంతృప్తినిస్తుంది అనే విషయాల గురించి ఆలోచించే అవకాశం ఎక్కడ దొరుకుతుంది. ఎప్పుడూ భర్తకు కావల్సినవి, పిల్లలకునచ్చినవి చేయడం అనే ఆలోచనలే.

ఈరోజుల్లో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, కుట్లు అల్లికలు మొదలైనవి చేసి తమకంటూ ఆదాయం ఏర్పరచుకుంటున్నారు. కాని అవి కుటుంబ నిర్వహణకు, పిల్లల ఖర్చులకు సరిపోతున్నాయి. సరేలే భార్య ఎంత కష్టపడినా కుటుంబ ఆదాయానికే కదా అని భర్తలు ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనూ ఆమె తన కుటుంబ నిర్వహణలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఊరుకోరు. తమను దాటి పోనివ్వరు భర్తలు.

webdunia
WD
పూర్వం ఆడవాళ్ళను ఎప్పుడూ మగవారి వెనకాలే ఉండేలా చేసేవాళ్ళు, ఇప్పుడు కనీసం తమతో సమానమేనని ఒప్పుకుంటున్నారు. కాని తమను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు పడనివ్వరు. అయినా స్త్రీలు సహనంతో రెండు బాధ్యతలు సమర్ధవంతంగానే నిర్వహించగలుగుతున్నారు. ఎవ్వరిని నొప్పించక తానొవ్వక అన్నట్టు.

నిజంగా అమ్మ చేసే పనులన్నీ మీరు చేయగలరా? ఇక్కడ అమ్మ అంటే ఇంటి ఇల్లాలు. ఒక్కసారి.... కనీసం మూడు రోజులు అమ్మ స్థానంలోకి వెళ్ళి ఆమె చేసే పనులన్నీ మీరు చేయగలరా ప్రయత్నించి చూడండి. అలాగే ఉద్యోగం చేస్తూ, ఇంటిపనులనూ సమర్ధవంతంగా చేసే మహిళల్లా మగవారూ ఆ పనిని చేయగలరేమో ప్రయత్నించి చూడండి.

సాధ్యం కాదు కదూ... మరి అలాంటప్పుడు స్త్రీని ఎందుకు లోకువగా చూస్తారు? అంటే భార్య(అమ్మ ) ఉన్నది ఇంటిపని చేయడానికేనా. పెళ్ళి అయినప్పటినుండి కుటుంబంకోసం ఎంతో కష్టపడుతుంది కదా... అని ఒక్కసారైనా ఆలోచించారా? కేవలం ఆమె ఉన్నది ఇంటి పనులు చేయడానికే అని అనుకుంటున్నారా?

ఒక్కసారైనా అమ్మకు ఏదంటే ఇష్టం. ఏ స్వీటు అంటే చాలా ఇష్టం. ఏ పుస్తకం చదవాలనుకుంటుందో, ఏదైనా నేర్చుకోవాలనుకుని మానేసిందో... ఇత్యాది విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నించారా...? ఆడది కదా ఓ చీరో, ఓ నగో ఇస్తే సంతోషిస్తుందిలే అనుకుంటారు కదా. కాని వాటికంటే ఆమెకు చాలా ఇష్టమైనది ఏదో ఉండఉంటుంది.

అదేదో కనుక్కుని చేయగలిగితే (డబ్బులు ఇవ్వకున్నా) ఆమెకు నిజమైన సంతృప్తి కలుగుతుందేమో. ఇప్పటికైనా కనుక్కోండి. ఆమెను ప్రోత్సహించండి. భార్యగా... తల్లిగా తన బాధ్యతలతో పాటు తనకంటూ ఒక జీవితం , ఒక లక్ష్యం సృష్టించుకోనివ్వండి. అప్పుడే ఆమెకు నిజమైన ఆనందం.

నేటి తరానికీ ఈ టపా నచ్చకపోవచ్చు. ఇది నా తరానికి, నా ముందు తరానికి చెందిన అమ్మలకు చెందిన వాస్తవాలు. ఇలాంటి ప్రాణమిచ్చే అమ్మలు ఎందరికో ఉన్నారు. లేదనుకునేవారు కోట్లున్నా బిచ్చగాళ్లకిందే లెక్క. ఉన్నవారు పైసా లేకున్నా కోటీశ్వరులే.

Share this Story:

Follow Webdunia telugu