Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24 ఏళ్ల సర్వీసులో 23 ఏళ్ల పాటు సెలవులే : సరికొత్త రికార్డు!

Advertiesment
School
, బుధవారం, 6 ఆగస్టు 2014 (14:40 IST)
మధ్యప్రదేశ్‌ విద్యాశాఖ ఓ ఉపాధ్యాయిని రికార్డు సృష్టించారు. మధ్యప్రదేశ్ విద్యాశాఖలో సంగీతా కశ్యప్ ఉపాధ్యాయిని. అంతేనా, 24 ఏళ్ల తన సర్వీసులో ఏకంగా 23 ఏళ్ల పాటు సెలవులో కొనసాగిన ఆమె రికార్డు సృష్టించారు. ఇన్నాళ్లు అంతగా పట్టించుకోని మధ్యప్రదేశ్ సర్కారు ఎట్టకేలకు సుదీర్ఘ కాలం పాటు సెలవులో ఉన్న సంగీతాపై చర్యలకు ఉపక్రమించింది.
 
వివరాల్లోకి వెళితే, 1990లో సంగీతా కశ్యప్ రాష్ట్ర విద్యా శాఖలో ఉపాధ్యాయినిగా ఎంపికై, ఇండోర్ పరిసరాల్లోని మహారాణి రాధాబాయి కన్యా విద్యాలయలో విధుల్లో చేరారు. అయితే ఏడాది గడిచిందో, లేదో మూడేళ్ల సెలవు పెట్టారు. ఆమె సెలవు ముగుస్తుందనగా, జరిగిన బదిలీల్లో భాగంగా ఇండోర్‌లోని ప్రభుత్వ అహల్య ఆశ్రమ పాఠశాలకు ఆమె బదిలీ అయ్యారు.
 
సెలవు ముగించుకుని అహల్య ఆశ్రమ పాఠశాలలో విధుల్లో చేరిన సంగీతా, వెనువెంటనే మెటర్నిటీ లీవు పెట్టేశారు. అంతే మళ్లీ ఆమె కనబడితే ఒట్టు. విధులకు ఎగనామం పెట్టిన ఆమె పత్తా లేకుండా పోయారు. విధులకు హాజరు కమ్మంటూ ఎన్నిసార్లు నోటీసులు పంపినా, ఆ లేఖలన్నీ తిరుగుటపాలో ఇట్టే తిరిగివచ్చేశాయని పాఠశాల ప్రిన్సిపల్ సుష్మా వైశ్య చెబుతున్నారు. 
 
23 ఏళ్ల పాటు విధులకు గైర్హాజరవుతున్న సంగీతాపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోందని వైశ్య చెప్పారు. 
 
సంగీతా లాగే మరో మహిళ కూడా తన టీచర్ ఉద్యోగానికి పదేళ్ల పాటు సెలవు పెట్టేశారట. రచన దూబే అనే ఉపాధ్యాయిని, పీహెచ్ డీ పట్టా కోసమంటూ పదేళ్ల క్రితం సెలవు పెట్టినప్పుడు కనిపించడమే కాని ఆ తర్వాత ఆమె కూడా పత్తా లేకుండా పోయారట. సంగీతాతో పాటు రచనపైనా చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖాధికారులు పాత ఫైళ్లకు బూజు దులుతున్నారట. ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి. 

Share this Story:

Follow Webdunia telugu