50 శాతం కోటా సమంజసమే: మహిళలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేకంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని కేంద్ర మంత్రి మండలి గురువారం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా మంత్రులు, మహిళా నాయకురాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మన్మోహన్ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినేట్ మహిళా రిజర్వేషన్లపై సుదీర్ఘంగా చర్చించింది. రానున్న పంచాయితీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మహిళలను రాజకీయంగా ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని చాలామంది మహిళలు రాజకీయాలవైపు దృష్టి సారించే అవకాశం ఉందని పలు మహిళా సంఘాల నాయకురాళ్ళు ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో మహిళల్లో సాధికారత, సమానత్వం, నాయకత్వపు లక్షణాలు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని పలువురు మహిళలు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోం శాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ మహిళా పక్షపాతిగా ఆమె అభివర్ణించారు. ఒక్క కాంగ్రెస్ పార్టీనే మహిళలను గుర్తించి వారిని ప్రోత్సహిస్తోందని ఆమె తెలిపారు. కేవలం మహిళలను ప్రోత్సహించడమే కాకుండా దేశంలోని అత్యున్నతమైన పదవులను ఈ ప్రభుత్వం కట్టబెడుతోందని, ఇది కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళా మంత్రులు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, మహిళా లోకాన్ని మరింత చైతన్య పరిచేలా తమ ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో రానున్న రోజులలో మహిళలదే అధికారమని వారు సంతోషం వెలిబుచ్చారు. ఈ రోజును చరిత్రలో లిఖించదగ్గ రోజుగా వారు అభివర్ణించారు.