Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్త్రీజన్మ ధన్యం..

స్త్రీజన్మ ధన్యం..

జ్యోతి వలబోజు

WD
ఆడదానిగా పుట్టడం ఒక వరం. ఇది నా అభిప్రాయం. మళ్ళీ జన్మలో కూడా నేను స్త్రీలా పుట్టాలనే కోరుకుంటాను. నేను చెప్పేది ఒక సగటు భారతీయ స్త్రీ అనుభవాలు. ఎక్కువగా నావే అనుకోండి. నా చుట్టూ ప్రపంచంలో నేను చూసిన అనుభవాలు.

మగవాళ్ళు పెళ్లి కాకముందు ఏ బాదరబందీ, ఆంక్షలు లేకుండా పెరుగుతారు, తిరుగుతారు. అందుకే పెళ్ళి కాగానే కుటుంబపరంగా ఉన్న కట్టుబాట్లు పాటించక తప్పదు కాబట్టి తమ స్వాతంత్ర్యము కోల్పోయామని ఫీలవుతారు. స్వతంత్రంగా తిరగలేము, ఇష్టమొచ్చినట్టుగా ఖర్చుపెట్టలేము అని వాపోతుంటారు.

కాని ఆడపిల్లలకు మొదటినుండి అసలు స్వాతంత్ర్యము ఉండదు( ఇవాళ కొత్త తరంలో అలా లేదులెండి, మార్పు వస్తోంది). పెళ్లి కాక ముందు తల్లితండ్రులు, పెళ్ళి అయ్యాక భర్త,వృదాప్యంలో పిల్లలు చెప్పినట్టు ఉండాల్సి వస్తుంది. ఐనా వాళ్ళు ఒక కర్తవ్యంగా సంతోషంగా నిర్వహిస్తారు. తమ కుటుంబానికి సేవలు చేయడం, అందరిని సంతోష పెట్టడంలోనే ఆనందాన్ని పొందుతారు.

పెళ్ళి అనేది ఒక తంతు కాదు. రెండు కుటుంబాలు, రెండు నిండు జీవితాలు కలిపి ఒకటిగా జీవించడమనే అద్భుత అనుబంధం. ఈ జంట వంశాన్ని వృధ్ధి పరచాలి.ఇది పరస్పర ప్రేమ, నమ్మకం, ఆత్మీయత, అనుబంధముతో నిర్వహించే ప్రక్రియ. దీనిని బాదరబందీ అని ఎందుకనుకోవాలి.

నిజమే చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళంత ఓపికగా సహనంగా ఉండలేరు. ఉద్యోగ నిర్వహణలో తలమునకలై కుటుంబ బాధ్యతలు కూడ నెత్తికెత్తుకోవడానికి అంతాగా ఇష్టపడరు. ఆ బాధ్యత భార్య తీసుకుంటుంది. స్త్రీ జీవితంలో కూతురుగా, భార్యగా, తల్లిగా, అత్తగా ఇలా ఎన్నోదశలు ఉన్నాయి. అటు పుట్టింటివారిని, అత్తింటివారిని మెప్పిస్తూ ఎవ్వరితోను మాటపడకుండా, తన సంసారాన్ని చక్కదిద్దుకుంటుంది స్త్రీ.

ఒక మగవాడు చదువుకుంటే అతడు మాత్రమే చదువుకున్నట్టు, కాని ఒక స్త్రీ చదువుకుంటే మొత్తం కుటుంబం చదువుకున్నట్టు అంటారుకదా. ఐనా ఎవరైన క్రింద పడి దెబ్బతగిలితే "అమ్మా" అంటారు కాని అయ్యా అనో నాన్నా అనో అనరు కదా. ఆ బాధలో అమ్మ మాత్రమే గుర్తొస్తుంది కాబట్టి. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టే అమ్మను సృష్టించాడంటారు.

పిల్లలకు కూడా అమ్మదగ్గర ఉన్నంత చనువు నాన్న దగ్గరుండదు కదా. నాన్నఅంటే గౌరవము భయము ఉంటుంది. నాన్నను ఏదైనా అడగాలనుకుంటే అమ్మ రికమెండేషన్ తప్పనిసరి. కాని నేటి రోజులలో మగవారు కూడా ఉద్యోగం, కుటుంబం రెండింటిలో భార్యకు సహకరిస్తున్నారు. ఎందుకంటే కుటుంబంలో భార్యాభర్తలు ఉద్యోగం చేయక తప్పడంలేదు.

భార్య స్థానంలో కూడా స్త్రీ తన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తుంది. కొంతమంది తప్ప. కార్యేషు దాసి,కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభా అని ఊరకే అన్నారా పెద్దలు. మగవాళ్ళు సంపాదించడము, ఇంట్లోవాళ్ళకు అన్నిసమకూర్చడము తమ బాధ్యత అనుకుంటారు.

కాని నేటి స్త్రీ ఉద్యోగం చేస్తూనే ఇంటి బాధ్యతలు, పిల్లల ఆలనా పాలనా సమర్ధంగా నిర్వహిస్తూ ఉంది. ఒక్క శారీరకంగా తప్ప స్త్రీ , పురుషుడికి ఏవిధంగానూ తక్కువ కాదు. ఆమె ధైర్యం తెగువ అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించుకుంటుంది. అనుకూలవతియైన భార్య దొరకడం మగవాడి అదృష్టం అని నా అభిప్రాయం. అందుకే మళ్లీ జన్మలో కూడా ఆడదానిలా పుట్టడానికే ఇష్టపడతాను. ఎందుకంటే స్త్రీ అంటే ప్రేమ, ఆప్యాయత, కరుణ, క్షమాగుణం, శౌర్యం, తెగువ అన్నీ కలబోసిన అద్భుతమూర్తి..

Share this Story:

Follow Webdunia telugu