కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకొచ్చిన "సమాచార హక్కు చట్టం"పై హీహెచ్‌డీని సాధించిన తొలి మహిళగా... ఆంధ్రరాష్ట్రానికి చెందిన ఓ మహిళ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
వివరాల్లోకి వస్తే... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, విడవలూరుకు చెందిన మడపర్తి సరోజనమ్మ అనే మహిళ సమాచార హక్కు చట్టంపై పీహెచ్‌డీ చేసిన తొలి మహిళగా రికార్డులకెక్కారు. ఈ విషయాన్ని విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రారు ప్రకటించినట్లు సరోజనమ్మ మీడియాకు వెల్లడించారు.
ఇదిలా ఉంటే... ఇప్పటిదాకా సమాచార హక్కు చట్టంపై పీహెచ్‌డీ చేసినవారు దేశంలోనే ఎవరూ లేరు. సరోజనమ్మ మొదటిసారిగా భారతదేశంలో ఈ చట్టంపై విమర్శనాత్మక పరిశోధనలు చేయడం ద్వారా పై గౌరవాన్ని సాధించగలిగారు. కాగా, ఈమె విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనే ఎం.ఎల్. పూర్తిచేసి, అక్కడే అధ్యాపకురాలిగా స్థిరపడ్డారు.