సంపన్న భారతీయుల ఫోర్బ్స్ జాబితాలో హర్యానా రాష్ట్రమంత్రి సావిత్రి జిందాల్ స్థానం సంపాదించుకున్నారు. హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా మంత్రి వర్గంలోని రెవెన్యూ, డిసాస్టర్ మేనేజ్‌మెంట్, కన్సాలిడేషన్, రిహాబిలిటేషన్, హౌసింగ్ మంత్రిత్వ శాఖలను నిర్వహించే 58 సంవత్సరాల సావిత్రి జిందాల్ దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా ఫోర్బ్స్ జాబితాకెక్కారు.
జిందాల్ గ్రూప్ చైర్ పర్సన్‌గా కూడా పనిచేస్తున్న సావిత్రి హుడా మంత్రి వర్గంలో లో-ప్రొఫైల్‌లో మంత్రిత్వ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో సావిత్రి 11వ స్థానం సంపాదించగా, ఈసారి మాత్రం 290 అమెరికన్ డాలర్ల నికర ఆస్తితో 12వ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంతో అట్టుడికి పోతున్న ప్రస్తుత తరుణంలో కూడా... రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్, రిలయన్స్ అడాగ్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, రియాల్టీ మేటి కేపీ సింగ్ లాంటి 40 మంది సంపన్న భారతీయుల ఫోర్బ్స్ జాబితాలో... 290 కోట్ల అమెరికన్ డాలర్ల విలువచేసే నికర ఆస్తులతో సావిత్రి 12వ స్థానంలో నిలబడటం గమనార్హం.
ఇదిలా ఉంటే... భర్త మరణం తరువాత హుడా మంత్రివర్గంలోకి అడుగుపెట్టిన సావిత్రి జిందాల్, తన భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న హిసార్ అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీచేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. చండీగర్‌కు 300 కిలోమీటర్ల దూరంలోని హిసార్ పట్టణం కేంద్రంగా జిందాల్ కుటుంబం తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
హిసార్ పట్టణంలోనే జిందాల్ కుటుంబం విద్యాదేవి జిందాల్ స్కూల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. కాగా, జిందాల్ తరువాత "టైమ్స్ ఇండియా గ్రూప్" చైర్‌ఫర్సన్ ఇందుజైన్ 17వ స్థానాన్ని సాధించారు.