బాలీవుడ్ హీరోయిన్ రీనా కపూర్ తన వృత్తి పట్ల చూపిన నిబద్ధతకు ప్రముఖ హిందీ చిత్ర నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్ గర్విస్తోంది. "వో రెహనే వాలి మెలోన్ కీ" చిత్ర నిర్మాణం సందర్భంగా విష జ్వరానికి గురైనప్పటికీ ఆ రోజు షెడ్యూల్ చేసిన సీన్లను పూర్తి చేయడమే కాక మర్నాడు సైతం సకాలంలో షూటింగ్‌కు హాజరవడంతో వృత్తి పట్ల రీనా చూపిన నిబద్ధతను ఈ చిత్రనిర్మాణ సంస్థ కొనియాడుతోంది. కష్టాలకు తలవంచని ధీర హీరోయిన్గా రీనా గుర్తింపు పొందింది.
ఈ సందర్భంగా రీనా మాట్లాడుతూ గత మూడేళ్లుగా తాను రాజశ్రీ ప్రొడక్షన్ చిత్రాలలో పనిచేస్తున్నానని, తన చిత్రజీవితపు ప్రతి ఒడిదుడుకుల్లోనూ వారు తనకు బాసటగా నిలిచారని పేర్కొంది. అందుకనే రాజశ్రీ వారి చిత్రాలలో తాను నూటికి నూరుపాళ్లూ నిమగ్నమై పని చేస్తున్నానని చెప్పింది.
పరిశ్రమలో వృత్తి పట్ల అపర నిబద్ధత కలిగిన రాజశ్రీ ప్రొడక్షన్స్ తన సిబ్బంది యోగక్షేమాలను బాగా పట్టించుకుంటారని రీనా చెప్పింది. వారినుంచే వృత్తికి సంబంధించిన నియమాలను నేర్చుకున్నానని, వాటిని తాను అమలులో పెట్టడంలో ఎన్నడూ వెనుకాడబోనని తెలిపింది.
రాజశ్రీ ప్రొడక్షన్స్ టీవీ ఛానెల్ హడ్ కవితా బర్జాత్యా మాట్లాడుతూ, రీనా వంటి తారలు చిత్ర, టీవీ పరిశ్రమకు చాలా అవసరమని చెప్పారు. వృత్తి పట్ల నిబద్ధతను రీనా ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించుకుందని అన్నారు. ఒకరోజు షాట్‌కు ఆమె సిద్ధమైనప్పుడు అనుకోకుండా విద్యుత్‌కు అంతరాయం ఏర్పడి సెట్ ఇబ్బందులకు గురయిందని కవిత గుర్తు చేసుకున్నారు.
ఎలాంటి అసౌకర్యాన్ని వ్యక్తం చేయకుండా ఆమె తన డ్రెస్సింగ్ టేబుల్ మీదే కూర్చుని ఎండ సహాయంతో షూటింగ్‌కు సిద్ధమైపోయిందని తెలిపారు. ఇబ్బందికి గురైనా ఆమె త్వరగా సిద్ధమైపోయి సకాలంలో సెట్లోకి వచ్చిందని చెప్పారు. నిబద్ధత విషయంలో ఎవరైనా రీనా నుంచి నేర్చుకోవలసిందేనని కవితా ప్రశంసించారు.
ఆమె సమయ పాలనపట్ల యూనిట్‌కు ఎంత నమ్మకమంటే తెల్లవారుజామున షూటింగ్‌కు కూడా ఆమె లేట్ చేయదనే భరోసాతో సిబ్బంది అత్యుత్సాహంతో పని చేసుకుపోయేవారని కవిత కొనియాడారు. రీనా ఇచ్చిన సహకారం కారణంగానే తాము సకాలంలో నిర్మాణాన్ని పూర్తి చేసుకునేవారమని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్ పూర్తి కావడంతో ప్రతి ఒక్కరూ సంతసించేవారని కవిత చెప్పారు.
సో... వృత్తి నిబద్ధత ఈజ్ ఈక్విల్ టూ రీనా కపూర్ అని రాజశ్రీ ప్రొడక్షన్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రశంసలు పొందడం చిన్నవిషయం కాదు. ఏ వృత్తిలో ఉన్నవారికయినా ఇలాంటి నిబద్ధత అనుసరణీయం.. ఆచరణీయమే కదా..