Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరకట్న వేధింపుదారులకి ఉరి శిక్ష: అమలే ప్రశ్న

Advertiesment
ఇతరాలు
దేశంలో వరకట్న వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయి. సభ్యసమాజం తలదించుకునేలా తోటి మనషులు తమ తోటివారినే ప్రత్యక్షంగా కిరోసిన్ లేదా పెట్రోలు పోసి కాల్చి చంపడం దారుణం. ఈ విషయంపై ఈ మధ్యనే దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం నిందితునికి మరణ శిక్ష విధించాలని తీర్పునిచ్చింది.

ఇంతవరకూ బాగానే ఉంది. అయితే సదరు ముద్దాయికి ఖచ్చితంగా మరణ దండన అమలవుతుందా...? అంటే సందేహమే. ఎందుకంటే ఆ తర్వాత ప్రాణభిక్ష వంటి ఎన్నో దారులు శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఉన్నాయి.

వరకట్న నిందితులకు శిక్ష అమలు జరుగకపోవడంతో, వరకట్న వేధింపులు ఆగడం లేదు. ఫలితంగా నేడు సమాజంలో రోజురోజుకీ వరకట్న చావులు పెరుగుతూ పోతున్నాయి. అయితే వరకట్న వేధింపులకు గురై తనువు చాలిస్తున్న ఎందరో మహిళల దీన గాథలను చూసిన ధర్మాసనం కారకులైన వారిని ఉపేక్షించకూడదని గట్టిగా తీర్పు చెప్పింది. వరకట్న వేధింపులతో మహిళ ప్రాణాలను కబళిస్తున్నవారిని ఉరి తీయాలనే విషయం చాలామందికి కనువిప్పు కలగాలి.

ప్రస్తుతం ఏర్పాటైన కొత్త ప్రభుత్వం కోర్టు తెలిపిన అభిప్రాయాన్ని చట్టంగా తీసుకువస్తే చాలా బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి దారుణాలను అరికట్టేందుకు తప్పనిసరిగా చట్టాన్ని రూపొందిస్తే ఎంతోమంది అమాయకులైన అమ్మాయిల ప్రాణాలు కాపాడినట్లౌతుంది. అలాగే వరకట్నానికి వ్యతిరేకంగా పోరాడేందుకు తగిన నియమావళిని కూడా రూపొందించాలి. వరకట్నం ఇచ్చేవారిని-తీసుకునే వారిని కూడా శిక్షించేలా కఠినమైన చట్టాలను రూపొందించి వాటిపై ప్రజలకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రోజురోజుకు వరకట్న వేధింపు చావులు ఎక్కువౌవుతున్న నేపథ్యంలో 1961వ సంవత్సరంలోనే చట్టాన్ని అమలు చేశారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం కేవలం 2007వ సంవత్సరంలోనే అత్యధికంగా 8వేల మంది వరకట్న వేధింపులకు గురై మృత్యువాత పడ్డారు.

భారతదేశంలోని శిక్షాస్మృతి ప్రకారం వరకట్న వేధింపులపై ఉన్న చట్టాలు చాలా కఠినమైనవి. కాని అబ్బాయి తరపు వారు పోలీసులను మభ్యపెట్టి వారికి లంచాలు ఇచ్చి తమ వారిమీద ఎలాంటి కేసులు లేకుండా చూడాలని కోరడంతో ఇలాంటి కేసులు వెలుగులోకి రావడం లేదు. అయినా కొందరు అధికారులు తమ ప్రతాపం చూపించేందుకు బాధితులనే ఎక్కువ ఇబ్బందికి గురి చేస్తుంటారు. దీంతో వారు మానసికమైన క్షోభకు గురై రాజీ పడిన కేసులు చాలానే ఉన్నాయి.

వరకట్న వేధింపులకు గురై మృతి చెందిన మాట వాస్తవమే అయినప్పటికినీ పోలీసులు లంచాలు తీసుకుని కేసును తారుమారు చేస్తున్నారని ది లాన్‌సెట్ అనే మెడికల్ జర్నల్ పేర్కొంది. దీంతో బాధితులు ఇబ్బందులకు గురౌతున్నారని, ఎక్కువగా నష్టపోయేది అమ్మాయి తరపువారేనని ఆ పత్రిక తెలిపింది. ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారంకన్నాకూడా ఆరు రెట్లు ఎక్కువగా వరకట్న చావులుంటాయని జర్నల్ వెల్లడించింది.

స్త్రీని దేవతగా పూజించే ఈ భారతావనిలో ఇలాంటి దారుణాలు జరగడం దేశ మానవాళికే సిగ్గు చేటు. అలాంటిది ప్రస్తుతం పెరుగుతున్న జనాభాలో మహిళల శాతంకూడా తగ్గిపోతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖామంత్రి క్రిష్ణ తిరాథ్, కేంద్ర హోం శాఖామంత్రి పి. చిదంబరంలు కలిసి ఈ విషయంపై దృష్టి పెట్టి తగిన పరిష్కారం కనుగొనాలని విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుతం చట్టంలోనున్న లొసుగులను దృష్టిలో పెట్టుకుని నిందితులు తప్పించుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించి ప్రజల్లో తగిన అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటే వరకట్న చావులు నివారించవచ్చంటున్నారు విశ్లేషకులు.

ఇలాంటి అవగాహన కేవలం అమ్మాయిల తల్లిదండ్రులకే కాకుండా ప్రతి ఒక్కరికి...అంటే చిన్న పిల్లలకు, విద్యార్థినీ విద్యార్థులకు, యువతకు, పెద్దవారికికూడా అవగాహన తరగతులు నిర్వహించి వారిలో మార్పును తీసుకువస్తే చాలామంచిదంటున్నారు విశ్లేషకులు. గతంలో దాదాపు 10 మిలియన్ అమ్మాయిలు ఈ వరకట్నం వేధింపులకు గురయ్యారని లెక్కలు చెబుతున్నాయి.

ఇదిలావుండగా గతంలోనూ, ప్రస్తుతంకూడా భ్రూణ హత్యలు అత్యధికంగానే జరుగుతున్నాయి. వీటిపై ప్రత్యేకమైన దృష్టిని సారించి ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చింది. ఆ తర్వాత కొంతమంది తల్లిదండ్రులు అమ్మాయి పుడితే వెంటనే ఆ పసిపాపను చంపడమో లేదా చెత్తకుప్పల్లో పడేయడమో జరుగుతోంది. ఎందుకీ వివక్ష? అమ్మాయి అంటే ఎందుకింత చులకన?

భారతదేశాన్ని అభివృద్ధి దిశవైపు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు. కాని ఈ ఒక్క వ్యవహారంలో చట్టాలను పక్కనబెట్టి మరీ దారుణంగా అమ్మాయిలను హతమారుస్తున్నారు. దీనికి ముగింపు పలకాలంటే కఠినమైన చట్టాలను ఖచ్చితంగా అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu