రాజకీయాల్లో గ్లామర్ తప్పనిసరి: జయప్రద
సినిమాలలోనేకాక రాజకీయాలలోను గ్లామర్ ఉండాలని, గ్లామర్ ఉంటేనే ఏ రంగంలోనైనా రాణిస్తారని ప్రముఖ నటి, సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు, లోక్‌సభ సభ్యురాలు జయప్రద అన్నారు. తొలిసారిగా మోడలింగ్ చేసిన ప్రముఖ నటి జయప్రద(47) మాట్లాడుతూ... ప్రస్తుతం మోడలింగ్‌లోను, నటనాపరంగానే కాకుండా రాజకీయాల్లోను గ్లామర్ తప్పనిసరని ఆమె అభిప్రాయపడ్డారు. ర్యాంప్ వాక్ చేయడానికి ముందు తాను కాస్త నెర్వస్‌గా ఫీలయ్యానని, ఓ నటిగా తాను ఎన్నోసార్లు కెమెరా ముందు పనిచేసానని, కాని తొలి షాట్ అప్పుడు నెర్వస్‌గా ఫీలయ్యానని, తర్వాత తనకు అలవాటైపోయిందని, అదే నెర్వస్ ఇప్పుడు ఫీలైనట్లు ఆమె తెలిపారు. ఏదేమైనప్పటికీ ఈ అనుభవం తాను మరువలేనిదని, ర్యాంప్ షోలో పాల్గొనడంతో తనకు ఆకాశంలో విహరిస్తున్నట్లుందని ఆమె ఒకింత ఆనందానికి లోనవుతూ చెప్పారు. తాను కేవలం ఓ రాజకీయ నాయకురాలిగానే కాకుండా ఓ నటినని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఇదిలావుండగా ఈమెతోపాటు ప్రముఖ మాజీ క్రికెటర్, ప్రపంచకప్ గ్రహీత కపిల్‌దేవ్ పచ్చ రంగు కలిగిన కుర్తా-పైజామా ధరించి ర్యాంప్‌వాక్ చేసి సభికులను మంత్రముగ్దులను చేశారు.