పాంటలూన్స్ ఫెమినా మిస్ ఇండియా పోటీలు ముంబైలో ఆదివారం జరిగినాయి. ఇందులో మిస్ ఇండియా వరల్డ్-2009గా పూజా చోప్రా ఎన్నికైనారు. మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాన్ని ఏక్తా చౌధరి చేజిక్కించుకుంది. అలాగే శ్రేయ కిశోర్ మిస్ ఇండియాగా ఎన్నికైనారు.
అంధేరీ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమంలో దేశం నలుమూలలనుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అందమైన యువతులు చేరుకున్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు అందమైన అమ్మాయిలను పలు ప్రశ్నలతో ముంచెత్తారు. చివరిగా నెగ్గిన వారికి ఓ ప్రశ్నను వేశారు....ఒకవేళ భగవంతుడు మీ ముందు ప్రత్యక్ష్యమైతే మీరేం కోరుకుంటారు అని చివరి రౌండ్లో పోటీలో పాల్గొన్నపూజాను అడగ్గా తన సమాధానం ఇలా ఉంది..... ప్రతి క్షణం భగవంతుడిని తన తల్లి కళ్ళల్లో చూసుకుంటున్నానని, అలాగే కొంతమందికి తల్లి ప్రేమ లభించే అదృష్టం ఎందుకు కలగడం లేదని తాను భగవంతుడిని అడుగుతానని ఆమె సమాధానం ఇచ్చారు.
అలాగే ఏక్తా చౌధరిని అడుగగా...ఏక్తా సమాధానం ఇలావుంది... మనుషులంతా ఒక్కటే అయినప్పుడు ధర్మం పేరుతో వివిధ వర్గాలుగా ఎందుకుండామంటూ..ధర్మం అనేది అందరిని సమిష్టిగా ఉంచేదే కదా అని ప్రశ్నిస్తానని ఆమె తెలిపారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు మాధవన్, మోడల్ మలైకా అరోరా ఖాన్‌లు ఈ కార్యక్రమానికి సంధాన కర్తలుగా వ్యవహరించారు. ప్రముఖ టీవీ కళాకారులు స్వప్నిల్ జోషీ, కరణ్ వాహీలు ఈ షో సందర్భంగా ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తారు.