దేశంలో గృహ హింస చట్టం అమల్లోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలైనా దీని గురించి విద్యావంతులైన మహిళల్లో అవగాహన చాలా తక్కువగా ఉందని న్యాయనిపుణులు, ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం సమాజంలోని చాలా మంది స్త్రీలకు కట్నం తీసుకోవడం చట్ట ప్రకారం నేరమన్నవిషయం తప్ప, గృహ హింస చట్టం(పిడబ్ల్యుడివిఎ-2005) గురించి తెలియదని, ఈ చట్టం ప్రత్యేకంగా మహిళల కోసమే ఏర్పాటు చేసినట్లు స్వచ్ఛంద సంస్థలు తెలిపాయి. చట్టం గురించి సరైన సమాచారం తెలియకపోవడం వలననే గృహ హింస బారిన పడిన మహిళలు తగిన సమయంలో చట్టం ద్వారా రక్షణ పొందలేకపోతున్నారని పలు సంఘాలు అభిప్రాయపడ్డాయి.
గృహ హింస చట్టం గురించి పూర్తి అవగాహన లేకపోవడంతో దేశంలోని చాలామంది మహిళలు వరకట్నం కేసును ఆశ్రయిస్తుంటారు. వరకట్న కేసులు కోర్టులో తేలాలంటే చాలా కాలం పడుతుంది. గృహ హింస చట్టం గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి మహిళపై ఉంది.