Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లలు తిండి తినడానికి పది సూత్రాలు

Advertiesment
పిల్లలు తిండి తినడానికి పది సూత్రాలు
, బుధవారం, 20 జూన్ 2007 (19:16 IST)
చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ ఉండే మామూలు విషయం ఇది. అమ్మ తన బాబు లేదా పాపకు ఏదో పెట్టాలని తపన పడటం, వాళ్లు వద్దంటూ పరుగులు తీయడం, వారి వెనుక పెద్దలు పరుగు పెట్టడం.... ఇది మనం రోజూ చూసే వ్యవహారమే. మనసు పెట్టి వారంతట వారు పూర్తిగా తినాలే తప్ప మనం ఏదో చేసి పిల్లల చేత తినిపించాలంటే కొంచెం కష్ట సాధ్యం. ఈ నేపథ్యంలో కొంతమేరకైనా వారిని ఒప్పించి తినిపించేందుకు ఏం చెయ్యవచ్చో చూద్దామా ?

1. మంచి కథలు చెబుతూ తినిపించవచ్చు. అంటే వాళ్లు ఊ కొడుతున్నప్పుడల్లా ఒక్కో ముద్ద నోట్లో పెట్టేయవచ్చు.

2. టీవీలో వాళ్లకు ఇష్టమైన కార్టూన్‌ నెట్‌వర్క్ తరహా కార్యక్రమాలు వస్తున్నప్పుడు వాళ్లను ఆశ్చర్యపరుస్తూ ఏమైనా పెట్టవచ్చు.

3.. వాళ్లకు ఇష్టమైన నటీనటులు లేదా ఆటగాళ్లు బాగా తినడం వల్లే గొప్పవాళ్లు అయ్యారని చెప్పి తినేలా చెయ్యవచ్చు.

4. బాగా తింటే బలం వచ్చి పాఠశాలలో వాళ్లకే అన్నింటా మొదటి స్థానం వస్తుందని చెప్పవచ్చు.

5. కాయలు, పండ్లు తినిపించాలంటే... ఒక్కో రకం కాయ లేదా పండు తింటే ఒక్కో విధమైన శక్తి లేదా తెలివి పెరుగుతుందని ఉదాహరణలతో వివరించండి. ఈ కాయలు లేదా పండ్లలో గింజలు ఎక్కువగా ఉంటే వాటిని తొలగించి ఇవ్వండి. అప్పుడు వారు ఇష్టంగా తింటారు.

6. మంచిదే అయినప్పటికీ వారికి అంతగా రుచించనిది ఏదైనా తినిపించాల్సి వస్తే దానిపై పంచదార వంటిదేదైనా చల్లి ఇవ్వండి.

7. వాళ్లను తిట్టడం లేదా కొట్టడం లేదా బెదిరించడం ద్వారా మీరు బలవంతంగా తినిపించినా అది వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేగాక దీని వల్ల వారికి మీరంటే ఇష్టం తగ్గుతుంది.

8. ఏం పెట్టినా తినకుండా, ఆకలి వెయ్యడం లేదంటే ఒక సారి వైద్యునికి చూపించడం మంచిది. అలాగే వారిని సాయంత్రాలు ఆడుకోవడానికి విడిచిపెడితే కావలసినంతసేపు ఆడుకొని ఆ వెంటనే అలసటతో ఆకలిగా ఉంటారు. ఆ సమయంలో మీరు వారికి తగిన పదార్థాలు ఇవ్వవచ్చు.

9. నలుగురు పిల్లలతో వాళ్లనూ చేర్చడం ద్వారా ఒకళ్లతో మరొకరికి పోటీ పెట్టి తినిపించవచ్చు. ఎవరు తొందరగా తింటే వారికి ఓ బహుమతి ఇస్తామని లేదా షికారుకు తీసుకెళ్తామని కొంత ఆశపెడితే వాళ్లు పోటీపడి తింటారు.

10. నువ్వు తింటేనే నేనూ తింటానని మీరూ మారాం చేస్తే, వారిపై మీకు గల ప్రేమను వారు గుర్తించి తద్వారా మీరు పెట్టింది తింటారు.

Share this Story:

Follow Webdunia telugu