Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"నువ్వేం మాయ చేశావో కానీ..." అనే తీయని కంఠస్వరం...?

Advertiesment
శ్రేయా గోషల్
IFM
ఒక్కడులో "నువ్వేం మాయ చేశావో కానీ...." అని పాడిన తీయని కంఠస్వరం, "వచ్చే వచ్చే వాన మబ్బుల్లారా..." అంటూ ఆనంద్ చిత్రంలోని గీతంతో మనల్ని మేఘాలలోకి తీసుకెళ్లే ఆ కమనీయ కోకిల గానమాధుర్యం... ఎవరిది? ఆ మృదుమధుర గీతాలకు ప్రాణం పోసిన గాయని ఎవరూ...? ఆమే పాతికేళ్ల శ్రేయా గోషల్.

హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ, కన్నడ, మరాఠీ, మణిపురి, మలయాళ భాషలన్నిటినీ మాట్లాడగల శ్రేయ ఇప్పటికే వేల సంఖ్యలో పాటలు పాడేశారు. ఆమె కంఠస్వరం నుంచి మధురంగా జాలువారే పాటలను వింటూ మైమరచిపోయే శ్రోతలు నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్నారు.

శ్రేయ బెంగాలీ కుటుంబంలో 1984 మార్చి నెల 12న జన్మించారు. తండ్రి వృత్తిరీత్యా రాజస్థాన్‌లోని కోటాలో ఆమె చిన్నతనం, చదువు సాగాయి. తల్లికి సంగీతంలో అభినివేశం ఉండటంతో శ్రేయకు తొలి గురువు అమ్మే అయింది. దీంతో కోటాలోనే హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది.

అప్పట్లో చిన్నారుల సరిగమప ఎపిసోడ్‌లో శ్రేయ పాటలు విన్న ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి తన తదుపరి చిత్రంలో అవకాశం ఇస్తానని చెప్పారు. అయితే కొన్నాళ్ల వరకూ ఎటువంటి ఛాన్సులు ఆమెకు రాలేదు. అయితే ఒకనాటి ఉదయం బన్సాలి ఆఫీసు నుంచి శ్రేయకు పిలుపు వచ్చింది. తన తీయబోయే దేవాదాసు చిత్రంలో ఐశ్వర్యారాయ్‌కి నేపథ్య గాయనిగా అన్ని పాటలు పాడాలని అడిగారు.

అలా 2000 మార్చి 9న... అంటే ఆమె పుట్టినరోజుకు మూడు రోజులు ముందు "బైరీ పియా..." అనే తొలిపాటను ఆమె ఆలపించారు. అలా మొదలైన ఆమె ఇప్పటివరకూ ఎన్నో గీతాలను ఆలపించారు... ఆలపిస్తూనే ఉన్నారు. ఆమె పాటలను మెచ్చుకునే లక్షల అభిమానులకు ఆమె చెప్పే మాట ఏమిటంటే... సాధించాలనే పట్టుదల ఉండాలే కానీ సాధించలేనిది ఏదీ లేదని.

అంతేకాదు తను ఈ స్థాయికి రావడానికి తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు సినీ పరిశ్రమలో తనకు అవకాశాలిచ్చి ప్రోత్సహించిన సంగీత దర్శకులు ఉన్నారంటారు. మంచి ట్యూన్స్‌తో కూడిన పాటలు తనకు రావడం వల్లనే అశేష శ్రోతల అభిమానాలను పొందగలుగుతున్నానని సంతోషం వ్యక్తం చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu