దేశంలో 'గానకోకిల' అనే బిరుదు అతికొద్దిమందికే వస్తుంది. అలాంటి వారిలో ప్రథమ స్థానంలో నిలిచే గాయని.. ఆశాభోంస్లే. గత ఐదు దశాబ్దాలుగా హిందీ సినీ సంగీత ప్రపంచాన్ని తన గాత్రంతో ఉర్రూతలూగిస్తోన్న గాన కోకిల ఆమె. జనం మెచ్చిన ఈ కోకిల శనివారం తన 74వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. సంగీత కుటుంబంలో పుట్టి పెరిగిన ఆశామంగేష్కర్, అక్క లతా మంగేష్కర్ మాదిరిగానే తన పదో ఏట నుంచే ప్లేబ్యాక్ సంగీతాన్ని నేర్చుకున్న ఆశా.. మొదట్లో ఆమె లతా లాగే పాడినా, అనతి కాలంలోనే స్వంత గొంతును అలవర్చుకున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఓ.పి.నయ్యర్‌తో జతకలవడంతో ఆమె కెరీర్, దాంతో పాటు భారతీయ సినిమా సంగీతం కొత్త మలుపు తిరిగింది. ఆయన స్వరపరిచిన ఎన్నో మధురమైన గీతాలకు ఆమె గాయని. చిన్న చిన్న పాటలు పాడుతూ కెరీర్ సాగుతున్న కాలంలో ఆమెకు నయాదౌర్ (1959) చిత్రం టర్నింగ్ పాయింటినిచ్చింది. 'ఆంఖో సే చో ఉతరే హై దిల్ మే...'వంటి శ్రవణీయమైన గీతాలెన్నో వారు ఇరువురు అందించారు. ఆశా కెరీర్‌ను మలుపు తిప్పిన వారు ముగ్గురు- ఒ.పి.నయ్యర్, ఆర్.డి.బర్మన్, ఖయ్యూమ్. వీరితో పాటు మరో సెక్సీ తార కూడా ఉంది. ఆమే హెలెన్.
పియా తూ అబ్ జా.. (కారవన్), ఓ హసీనా జులుఫో వాలి... (తీస్రీ మంజిల్), హే మేరా దిల్ యార్ కా దీవానా (డాన్) వంటి పాటలెన్నో 60, 70లలో భారతీయులను ఉర్రూతులూగించాయి. తెరపై హెలెన్ సెక్సీ పాటలకు ఆశా గొంతు కాకుండా వేరే వారి గొంతు ఊహించుకోగలమా. తీస్రీమంజిల్ చిత్రం తర్వాత ఆర్.డి.బర్మన్, ఆశా కలిసి ఎన్నో వెస్ట్రన్ ఓరియంటడ్ పాటలు అందించారు. దమ్ మారో దమ్..వంటి పాటలు వినని వారెవరైనా ఉంటారా?
కేవలం హిందీకే పరిమితం కాకుండా.. తెల్లచీరకు తకధిమి (చిరంజీవి చిత్రం), 'సఖి'లో సెప్టెంబర్ మాసం...వంటి తెలుగు పాటలను కూడా పాడారు. పలు భాషల్లో కలిపి మొత్తం 12 వేలకు పైగా పాటలను ఆమె పాడారు.