Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"చీర"పై విజయం సాధించిన "కమలం"

కొన్నిరోజుల క్రితం చెన్నైలోని వెంకటేశ్వరా హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తోన్న వి. కమలం అనే విద్యార్థిని చీర ధరించటం అనే అంశంపై కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే...! ఈమె చుడీదార్ ధరించి క్లాసులకు హాజరు కావడంపై కాలేజీ యాజమాన్యం అభ్యంతరం తెలిపింది. పైగా విద్యార్థినులందరూ ఖచ్చితంగా చీర ధరించే రావాలనే నియమం పెట్టింది.

దీంతో న్యాయపోరాటానికి దిగిన కమలం "జాతీయ మహిళా కమీషన్"ను ఆశ్రయించి, ఆపై మద్రాసు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే క్రమశిక్షణ, హుందాతనం, ఔచిత్యాన్ని పాటించేందుకోసమే తాము చీరను డ్రెస్‌కోడ్‌గా పెట్టామని కాలేజీ యాజమాన్యం కోర్టులో తన వాదనను వినిపించింది.

ఈ కేసును విచారించిన న్యాయమూర్తి వెంకటరామన్.. చుడీదార్, సల్వార్‌లను దుపట్టాతో కలిపి ధరించటం అనేది సభ్యతతో కూడినదేనని తీర్పునిచ్చారు. విద్యార్థినులు చీరతోనే రావాలని నొక్కి చెప్పడం అహేతుకమే అవుతుందన్నారు. ఇదో దురదృష్టకరమైన అంశమని అభివర్ణించిన ఆయన, ఇలాంటి అంశాలను యాజమాన్యం, విద్యార్థులు సామరస్యంగా పరిష్కరించుకుని ఉంటే సరిపోయేదని వ్యాఖ్యానించారు.

ఇకమీదట కాలేజీ యాజమాన్యం విద్యార్థినులు చుడీదార్, సల్వార్‌లను దుపట్టాతో కలిపి ధరించేందుకు అనుమతినివ్వాలని వెంకటరామన్ ఆదేశించారు. అంతేగాకుండా, ఏ విధమైన డ్రెస్‌నూ నిషేధించే నిబంధనలు ఈ కాలేజీకి లేవని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే... విద్యార్థులకు తాము ఏ విధమైన డ్రెస్‌కోడ్‌ను ప్రకటించలేదని "మెడికల్ యూనివర్సిటీ" కూడా స్పష్టం చేయడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu