కౌగిలింత, ఆలింగనం అనే పదాలను ఎవరికీ విడమర్చి చెప్పనవసరం లేదు కాని శరీరంలో ఉండే ఒత్తిడి హార్మోన్లను ఒక చిరు కౌగిలింత మటుమాయం చేస్తోందని తాజా పరిశోధన కనిపెట్టింది. సన్నిహిత సంబంధాలు, పెళ్లి అనేవి చక్కటి ఆరోగ్యానికి దోహదకారులని ఇటీవలి ఓ స్విస్ అధ్యయనంలో తేలింది.
కౌగిలింతకు, ఒత్తిడికి మధ్య సంబంధాన్ని ధృవపర్చుకోవడానికి స్విట్జర్లండ్‌లోని జ్యూరిచ్ యూనివర్శిటీ పరిశోధకుల బృందం ఇటీవలే పెళ్లయిన 51 మంది జర్మనీ దంపతులను తమ పరిశోధనకు ఎంచుకున్నారు. ఒక వారంరోజుల అధ్యయనం తర్వాత దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను బయటపెట్టారు.
గాఢంగా ప్రియమైన వారిని కౌగలించుకోవడం, లైంగిక సంబంధంలోకి వెళ్లడం వంటి వాటిని ఆ వారంరోజులలో ఎక్కువగా పాటించిన దంపతులకు శరీరంలో ఒత్తిడి హార్మన్‌గా పిలువబడుతున్న కోర్టిసోల్ బాగా తగ్గిపోయినట్లు బయటపడిందని ఈ పరిశోధకులు చెప్పారు. శరీరంలో ఒత్తిడికి సంబంధించిన పలు మార్పుల వెనుక కోర్టిసోల్ హార్మోన్ పాత్ర ఉంటోంది. శరీరం బాగా ఒత్తిడికి గురయినప్పుడు ఈ ఒత్తిడి హార్మోన్ స్థాయి బాగా పెరుగుతుంది.
పనిస్థలంలో బాగా ఒత్తిడికి, సమస్యలకు గురవుతున్న దంపతులు పరస్పరం సన్నిహితంగా గడపడం ద్వారా ఈ ఒత్తిడి హార్మన్ ప్రభావాన్ని బాగా తగ్గించుకోవచ్చని స్విస్ పరిశోధన బృంద నేత డాక్టర్ బీట్ డైజెన్ తెలిపారు. మనుషుల మానసిక స్థితిని, మూడ్‌ను పెంచడం ద్వారా హార్మోన్ల స్థాయిని సాన్నిహిత్యం తగ్గించగలుగుతోందని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
అయితే మరింత సన్నిహితత్వం కోసం దంపతులు పదే పదే వెంపర్లాడాలి అని దీనర్థం కాదని ఆమె చెబుతున్నారు. ఇద్దరూ కలిసి పనిచేయడం ద్వారా దంపతుల మధ్య సానుకూల భావాలను ప్రవేశపెట్టడానికి పరస్పర సాన్నిహిత్యం దోహదం చేస్తుందని ఆమె అంటారు. వేరు వేరు దంపతులకు వేరు వేరు స్థాయిల్లో సాన్నిహిత్యం ఉంటుందని చెప్పారు. అంటే ప్రతిరోజూ తమ సాన్నిహత్యాన్ని చాటుకోవడం కోసం ప్రత్యేక వైఖరిని దంపతులు ప్రదర్శించనవసరం లేదని డాక్టర్ బీట్ డైజాన్ అభిప్రాయం.
కాబట్టి జీవితంలో పనిలో ఒత్తిళ్లను తగ్గించుకోవాలంటే పరస్పరం కౌగిలించుకోండి. యావతో కాదు... సానుకూల ప్రేమభావంతో.. ఇదే ఒత్తిడి నివారణకు సరైన మందు.