"చట చటలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు..." అని ఏనాడో మన తెలుగు కవి చెప్పేశాడు. ఆయన చెప్పింది ముమ్మాటికి నిజం అంటున్నారు పరిశోధకులు. అతి పొడవైన కేశ సంపదతో అలరారే అమ్మాయిలను అబ్బాయిలు అధికంగా ఇష్టపడతారట. పొడవాటి జడను కలిగిన అమ్మాయిలను చూస్తే వారికి వివశులైపోతారట.
పరిశోధనల వివారలను ఒకసారి పరికిస్తే... లండన్‌కి చెందిన కొందరు శాస్త్రవేత్తలు అమ్మాయిలకు సంబంధించిన బాహ్య సౌందర్యాలలో అబ్బాయిలను అతిగా ఆకర్షించగల అంశాలేమిటని శోధనలు చేసినప్పుడు పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సర్వేలో పాల్గొన్న 3 వేల మంది పురుషులలో సుమారు 43శాతం మంది పొడవైన జుత్తు కలిగిన అమ్మాయిలు తమను విశేషంగా ఆకర్షిస్తారని చెప్పారు.
పొడవైన కేశ సంపద కలిగి ఉండటం వల్లనే కొందరు సినీ హీరోయిన్ల వారికి అభిమాన నటీమణులయ్యారట. మధ్యస్త పొడవు జుత్తు కలిగినవారు ఓ మోస్తరుగా ఆకర్షించగలరనీ, కురుచ జుత్తు.. పొనీ టైల్‌తో గుర్రపు తోకలా వేలాడే జుత్తుకల అమ్మాయిలను తామసలు పట్టించుకోమని సర్వేలో పాల్గొన్న మూడొంతుల మంది పురుషులు చెప్పుకొచ్చారు.
అమ్మాయిలను అత్యంత ఆకర్షణీయంగా నిలబెట్టేది కేశ సంపదేనని వారు ముక్తాయించారు. పొడవైన జుత్తు ఆడతనానికి ప్రతీక అనీ, సెక్సీ లుక్‌కి ఇది ప్రధాన ఆకర్షణ కాగలదని వారు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన హెయిర్ డ్రైయింగ్, నైస్ కటింగ్, పోనీ టైల్ వంటివాటిని చేయించుకుని తిరిగే అమ్మాయిలవైపు దృష్టి మరలినా వారు తమను ఆకర్షించలేరని వెల్లడించారు. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే... అమ్మాయిలు సైతం ఒత్తైన జుత్తు కలిగిన అబ్బాయిలంటేనే మక్కువచూపుతారట.