ప్రపంచవ్యాప్తంగా చట్టసభలలో మహిళామణుల శాతం 18కి చేరుకుంది. ఇది 1995 తర్వాత 60 శాతానికి పెరిగింది. మహిళా చట్టసభల సమితి అధ్యక్షురాలు, ఫిలిపీన్ సెనేటర్ పియా కాయిటానో మాట్లాడుతూ...మహిళలు ఇంకా అభివృద్ధి చెందాలని, ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువని ఆమె అభిప్రాయపడ్డారు. కొన్ని దేశాల్లోని చట్టసభలలో సగటున పురుషులు 5మందిలో ఒక మహిళ ఉండడంకూడా గగనమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాలలోకి రావడానికి మహిళలు వెనుకంజ వేస్తున్నారని, ఈ రంగంలో వారికి పెను సవాళ్ళు ఎదురౌతున్నాయని ఆమె పేర్కొన్నారు.
నిరుడు 54 దేశాలలో చట్ట సభలకు జరిగిన ఎన్నికలలో, అలాగే ఆధునికీకరణ నేపథ్యంలో మహిళామణుల ప్రాతినిధ్యం 18.3 శాతం పెరిగినట్లు ఐపీయూ తన రిపోర్ట్‌లో తెలిపింది. కాగా ఇది 2007వ సంవత్సరంలో 17.7 శాతంగావుండింది. అదే 1995వ సంవత్సరంలో 11.3 శాతంగావుండిందని రిపోర్టులు చెబుతున్నాయి.
ఇదిలావుండగా మహిళలు అత్యధిక సంఖ్యలో వివక్షతకు లోనౌతున్నారని, పేరు, పదవి మహిళలదైతే, అధికారం మాత్రం వారి భర్తలదేనని, ఇలా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నదేనని ఆమె పురుష జాతిని దుయ్యబట్టారు. ఇలా చూస్తూ ఊరుకుంటే మహిళలు ఇంకా మగవారి దృష్టిలో చులకనౌతారని, వారితో సమానంగా ఎదగాలంటే ప్రతి మహిళ చదువుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుందని, ఆమె తన పిల్లలకు విచక్షణా జ్ఞానాన్ని అందించగలదని, తద్వారా సమాజం బాగుపడగలదని ఆమె అభిప్రాయపడ్డారు. రానున్న రోజులలో మహిళ వంటింటి కుందేలు కాకూడదని, తమకున్న హక్కులను అనుభవించడానికి తనువు చాలించాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.