మహిళల్లో ప్రతి నెలా వచ్చే రుతుస్రావం అనేది సిగ్గుపడాల్సిన అంశం కాదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు. అదేసమయంలో ఈ రుతుస్రావం అంశంపై సమాజంలో ఉన్న అపోహలు పోగొట్టేందుకు ముఖ్యంగా అబ్బాయిలను ఎడ్యుకేట్ చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
మే 28వ తేదీ మెనుస్ట్రియల్ హైజిన్ డే. వ్యక్తిగత పరిశుభ్రత, రుతుస్రావంపై అవగాహన కల్పించే నిమిత్తం ప్రతి ఏడాది మే 28న మెనుస్ట్రియల్ హైజిన్ డేను నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి ట్విట్టర్ ద్వారా స్పందించారు. రుతుస్రావం అనేది సిగ్గుపడాల్సిన అంశం కాదు. అది శరీరంలో జరిగే సహజ ప్రక్రియ. ఈ విషయంలో అమ్మాయిలనే కాదు అబ్బాయిలను ఎడ్యుకేట్ చేయాల్సిందిగా ఆమె కోరారు.
అంతేకాకుండా, జన్ ఔషది కేంద్రాల్లో చాలా తక్కువ ధరలకే శానిటరీ నాప్‌కిన్స్‌ను లభిస్తున్నాయన్నారు. దేశంలోని మహిళలంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు.