యుగాల్లో గణపతి తల్లిదండ్రులు ఎవరు..?
యుగయుగాల్లో గణపతికి తల్లిదండ్రులు ఎవరని తెలుసుకోవాలనుందా.. అయితే ఈ కథనం చదవండి. కృతయుగంలో ఈయన తల్లిదండ్రులు అదితి కశ్యపులు. బంగారు శరీరచ్ఛాయతో పది చేతులతో సింహవాహనమెక్కి మహోత్కట గణపతి పేరుతో ప్రసిద్ధుడై దేవాంతక నరాంతక రాక్షసుల్ని వధించాడు. త్రేతాయుగంలో గణనాధుని తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. స్ఫటిక శరీరచ్ఛాయతో 8 చేతులవాడై మయూర వాహనం ఎక్కి మయూర గణపతిగా ఖ్యాతి నార్జించి సింధువనే రాక్షసుణ్ణి చంపాడు. ద్వాపరయుగంలో పార్వతి నలుగుమట్టి ద్వారా పుట్టి, కుంకుమరంగు శరీరచ్ఛాయతో 4 చేతులవాడై ఎలుక వాహనాన్ని ఎక్కి గజావన గణపతి పేరుతో విఖ్యాతుడై సిందూరడనే రాక్షసుడిని మట్టుపెట్టాడు. కలియుగంలో తనంత తానుగా (స్వయంభువు) పుట్టి పొగ రంగు శరీరచ్ఛాయతో రెండు చేతులవాడై అశ్వ వాహనాన్ని ఎక్కి ధూమకేతు గణపతి పేరిట కలియుగంలోని మొదటి పాదం దాటాక (1,80,000 సంవత్సర మీదట) దుర్జనులందర్నీ వధిస్తాడు.