వినాయక చవితి ఎలాంటి వంటకాలు విఘ్నేశ్వరుడికి కుడుములు, మోదకాలు సమర్పించాలి. ముఖ్యంగా మోదకాలు, కుడుములంటే బొజ్జ గణపయ్యకు మహాప్రీతి. అందుచేత వినాయక చవితిని పురస్కరించుకుని స్పెషల్ వంటకాలను ఎలా చేయాలో చూద్దాం..
కుడుముల తయారీ..
కావలసిన పదార్థాలు:
బియ్యం రవ్వ : రెండు గ్లాసులు
శనగపప్పు: 2 టేబుల్ స్పూన్లు
కొబ్బరి తురుము: రెండు కప్పులు
ఉప్పు: రుచికి తగినంత
తయారీ విధానం:
ఒక వెడల్పాటి పాన్‌లో రెండు గ్లాసుల నీరు పోసి, దీనిలో తగినంత ఉప్పు, శనగపప్పు వేసి స్టౌ మీద పెట్టాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు రవ్వ పోసి కలపాలి. మెత్తగా అయ్యేవరకు ఉడికించి, తర్వాత క్రిందికి దించి కొబ్బరి తురుము కలపాలి.
చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకొని, ఇడ్లీ ప్లేట్‌లో పెట్టి, ఆవిరి మీద ఐదు నిమిషాలు పాటు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత ప్రసాదానికి తీసుకోవాలి.
జిల్లేడు కాయలు
కావలసిన పదార్థాలు:
బియ్యం రవ్వ: రెండు కప్పులు
బెల్లం తరుగు : ఒక కప్పు
పచ్చికొబ్బరి తురుము: రెండు కప్పులు
గసగసాలు: ఒక టేబుల్ స్పూన్
బాదం, జీడిపప్పు, కిస్ మిస్: రెండు టేబుల్ స్పూన్లు
నెయ్యి: రెండు స్పూన్లు
యాలకుల పొడి : అర టీ స్పూన్
తయారీ విధానం :
ముందుగా గిన్నెలో నాలుగు కప్పు నీళ్లను పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడే చిటికెడు ఉప్పు వేసి, రవ్వ చేర్చి ఐదు నిమిషాల పాటు ఉడికించాలు. రవ్వ మెత్తగా ఉడికిన తర్వాత చల్లార్చుకోవాలి. మరో పాత్రలో కొబ్బరి తురుము, తరిగిన బెల్లం కలిపి కొద్దిగా నీరు చల్లి ఐదు నిమిషాల పాటు ఉడికించి.. నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, వేయించిన గసగసాలు యాలకుల పొడి వేసి కలపాలి.
ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టాలి. బియ్యపు రవ్వతో చేసిన పిండి ముద్దను తీసుకుని, పూరీలా అదిమి, మధ్యలో కొబ్బరి ముద్ద పెట్టి, అన్ని వైపులా మూయాలి. దీనిని పొడవుగా లేదా, కుడుము ఆకారంగా చేసుకొని, ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద ఉడికించాలి. చాల్లారిన తర్వాత నైవేద్యం సమర్పించాలి.
హెల్దీ వీట్ లడ్డు
కావలసిన పదార్థాలు :
గోధుమ పిండి: రెండు కప్పులు
బొంబాయి రవ్వ : పావు కప్పు
నెయ్యి: తగినంత
పంచదార పొడి : ఒక కప్పు
యాలకుల పొడి : అర టీ స్పూన్
బాదం, దాక్ష : రెండు టేబుల్ స్పూన్లు
ఫుడ్ కలర్ : చిటికెడు
తయారీ విధానం : ముందుగా డ్రై ఫ్రూట్స్‌ని నేతిలో వేపి పక్కన పెట్టుకోవాలి. మరో పాన్‌లో నెయ్యిని వేడి చేసురుని గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి. మరొక పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి, బొంబాయి రవ్వను వేయించాలి.
అందులో యాలకుల పొడి వేసి, తర్వాత గోధుమపిండి, బొంబాయిరవ్వ కలిపి, మరికాసేపు వేయించాలి. మరొక పాన్‌లో వేయించిన గోధుపిండి, రవ్వ మిశ్రమాన్ని పంచదార మిశ్రమంలో కలిపి, బాదంపప్పు, కిస్ మిస్ వేయాలి.. ఇందులో వేడిచేసిన పంచదార, ఫుడ్ కలర్‌ను బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే, చేతులతో గట్టిగా అదుముతూ లడ్డూలు కట్టాలి. అంతే వీట్ లడ్డు రెడీ.
బేసిన్ లడ్డు ఎలా చేయాలి
కావలసిన పదార్థాలు:
శనగపిండి : 2 కప్పులు
నెయ్యి: అరకప్పు
బొబ్బాయి రవ్వ: నాలుగు టేబుల్ స్పూన్లు
పంచదార పొడి: ఒక కప్పు
యాలకుల పొడి: 1 టేబుల్ స్పూన్
బాదంపలుకులు: ఐదు
ద్రాక్ష: పావు కప్పు
పసుపు: కాసింత
తయారీ విధానం :
ముందుగా బాదం పలుకులు, కిస్ మిస్ నెయ్యిలో వేయించి పక్కన పెట్టాలి. పాన్‌లో నెయ్యి వేసి, కరిగించాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక శనగపిండి వేసి, ఉండలు లేకుండా కలపాలి. పిండి కొద్దిగా బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంతవరకు వేయించాలి.
మరో పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి, బొంబాయి రవ్వను వేయించి, అందులో యాలకుల పొడి కలపాలి. తర్వాత శనగపిండి, బొంబాయి రవ్వ కలిపి, మరికాసేపు వేయించాలి. వేరొక పాన్‌లో పంచదార, ఫుడ్ కలర్ వేసి కలిపి, వేడి చేయాలి. వేయించిన శనగపిండి, రవ్వ మిశ్రమాన్ని పంచదార మిశ్రమంలో కలిపి, బాదంపప్పు, కిస్ మిస్ వేయాలి. ఈ పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే, చేతులతో గట్టిగా అదుముతూ లడ్డూలు పట్టుకోవాలి. అంతే బేసిన్ లడ్డు రెడీ.