బొజ్జ గణపయ్యకు కుడుములు, ఉండ్రాళ్లంటే మహా ప్రీతి. తొలి పూజ అందుకునే విఘ్నేశ్వరునికి కుడుములు నైవేద్యంగా సమర్పించి పనులకు శ్రీకారం చుడితే ఇక ఏ ఆటంకమూ రాదని పురోహితులు చెబుతున్నారు. ఇంకేముంది..? మీరు కూడా కుడుములు తయారు చేసి బొజ్జ గణపయ్య లొట్టలేసుకుని తినేలా చేయండి.
రవ్వలా కొట్టిన బియ్యపుపిండి - రెండు కప్పులు
శనగపప్పు - అర కప్పు
నెయ్యి- ఒక స్పూన్
ఉప్పు, నీళ్ళు - తగినంత
తయారీ విధానం:
ముందుగా రాత్రిపూటే బియ్యం నానబెట్టుకొని తెల్లారాక మిక్సీలో రవ్వలా వేసుకోవాలి. అలాగే శెనగలను 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి వేడయ్యాక, అందులో స్పూన్ నెయ్యి వేసి శనగపప్పును వేసి కొద్దిగా వేగనివ్వాలి. శనగపప్పు వేగాక వెంటనే నీళ్లు పోసి మరగనివ్వాలి.
అందులో తగిన ఉప్పు వేసి, ఆ తర్వాత బియ్యపుపిండిని వేసి ఉండలు లేకుండా కలియబెట్టుకోవాలి. వెంటనే మూతపెట్టి 4-5 నిమిషాలు ఆవిరిపట్టాలి. నీరంతా పిండి పీల్చేసుకున్నాక స్టౌ మీద నుంచి దించేసుకోవాలి. ఆ పిండితో నచ్చిన సైజులో ఉండలు చేసుకోవాలి. వీటిని ఇడ్లీ ప్లేట్లలో పెట్టి 25 నిమిషాలు ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే... కుడుములు రెడీ..!.