Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వినాయక చవితి : కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకోండి.!

వినాయక చవితి : కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకోండి.!
, శనివారం, 7 సెప్టెంబరు 2013 (15:30 IST)
webdunia
FILE
సర్వవిఘ్నాలను నివారించే దేవుడు వినాయకుడు. దేవతా గణంలో అగ్ర పూజ ఆయనకే. వక్రతుండిగా, లంబోధరుడిగా, గజాననుడు , సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనయుడు, మన రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాకంలో కొలువుదీరాడు.

సాక్షాత్తు వినాయకుడు వరసిద్ధి వినాయకుడిగా పూజలందుకుంటున్న ఈ క్షేత్రం చిత్తూరు జిల్లాలో ఉంది. తిరుపతి నగరానికి 70 కిలోమీటర్లు దూరంలో ఉంది. కాణిపాకం పూర్వ నామధేయం విహారిపురి. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలతో అందంగా ఆహ్లాదకరంగా దర్శనమిచ్చే ఈ దివ్య క్షేత్రంలో ప్రధాన ఆకర్షణ వరసిద్ధి వినాయకస్వామి ఆలయం.

రోజూ వేలాదిమంది భక్తులతో సందడిగా, గణనాధుడి నామస్మరణంతో పునీతమవుతున్న ఈ దివ్యక్షేత్రం సందర్శనం బహుజన్మల పుణ్యఫలంగా చెబుతారు. బహుదా నది ఒడ్డున ఈ క్షేత్రం అలరారుతోంది.

కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం అతి పురాతనమైనది. 11వ శతాబ్దానికి చెందినదిగా చెప్పబడుతున్న ఈ ఆలయాన్ని చోళరాజైన మొదటి కుళోత్తుంగ చోళుడు కట్టించినట్టు చారిత్రక ఆధారాలద్వారా తెలుస్తోంది. అనంతరం 1336లో విజయనగర రాజులు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషిచేసినట్లు తెలుస్తోంది.

అతి పురాతనమైన ఈ దివ్యాలయం అనంతరంతర కాలంలో అనేక మార్పులకు చేర్పులకు గురైంది. బహుదానది ఒడ్డున అలరారుతున్న ఈ ఆలయం అనేక పురాణ కథలకు, స్వామివారి లీలావిశేషాలకు పుట్టిల్లుగా అలరారుతుంది.

పురాణ కథ: ఇక్కడ స్వామివారు వెలవడం వెనుక కూడా ఓ పురాణ గాథ ఉంది. పూర్వం ఆ ప్రాంతంలో చెవిటి, మూగ, గుడ్డి వాళ్ళైన ముగ్గురు సోదరులు తమ పొలంలో బావులు తీస్తుండగా ఒక్కసారిగా వారి గునపానికి రక్తపు మరకలు అంటాయట. దాంతో ఆశ్చర్యపోయిన ఆ సోదరులు ఏమిటాని చూడగా వినాయకుని మూర్తి కనిపించిందట.

అలా మూర్తి కనిపించీ కనిపించగానే వికలాంగులైన ఆ ముగ్గురు సోదరులకు స్వస్థత చేకూరి మామూలు మనుషులయ్యారట. ఈ విషయం గ్రామ ప్రజలకు తెలిసి తండోపతండగాలు గ్రామస్థులు అక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టారట. వారు కొట్టిన కొబ్బరికాయల నీరు ఎకరంపావువరకు పారిందట.

తమిళంలో కాణి అంటే ఎకరంపావు భూమి అని అర్థం. పాంకం అంటే పారిందని అర్థం. కొబ్బరినీరు ఎకరం పావు పారింది కాబట్టి ఆ క్షేత్రానికి కాణిపాంకం అని పేరొచ్చింది. కాలక్రమంలో అదే కాణిపాకంగా రూపాంతరం చెందింది. కాణిపాకంలో కొలువుదీరిన వరసిద్ధి వినాయకస్వామి లీలామయుడు.

ఆశ్రీత జన రక్షకుడు. కోరిన వరాలిచ్చే కొండంత దేవుడు. ఈ ఆలయంలోని గర్భాలయంలోని బావిలో స్వామి దర్శనమిస్తాడు. స్వామివారి విగ్రహం కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఈ విగ్రహానికి ఓ విశేషం ఉంది. ఈ విగ్రహ సైజు క్రమంగా పెరుగుతుందని చెబుతారు. గత కొన్ని సంవత్సరాలకు పూర్వంకంటే ఇప్పటి విగ్రహం సైజులో బాగా పెరిగిందట.

ఇంతకుముందు స్వామివారికి అమర్చిన ఆభరణాలు నేడు సరిపోకపోవడమే దీనికి నిదర్శనం. కాణిపాకాన్ని ప్రమాణాలకు పెట్టింది పేరుగా చెబుతారు. స్వామివారి మీద నమ్మకం ఉంచి ప్రమాణాలుచేసే భక్తుల అభీష్టాలన్నీ తీరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అలాగే ఇక్కడ స్వామివారి సమక్షంలో చేసే ఎలాంటి వివాదమైన పరిష్కారమవుతుందని చెబుతారు.

స్వామివారి పట్ల విశ్వాసముంచి, ఇక్కడున్న కుండంలో స్నానంచేస్తే ఎలాంటి సమస్య అయినా పరిష్కారమవుతుందంటారు. రోజూ వేలాదిమంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయంలో స్వామివారు సిద్ధి, బుద్ధిల సమేతంగా కొలువుతీరారు. ఈ ఆలయంలో ఇంకా ఆంజనేయస్వామి, నవగ్రహాలతోపాటు ఇతర దేవతామూర్తుల మందిరాలు కూడా ఉన్నాయి.

దేశంలోనే ప్రముఖమైన వినాయక క్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారికి ఏటా వినాయక చవితిరోజులలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 20 రోజులపాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారిని వివిధ వాహనాలపై ఊరేగిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu