Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు?

వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు?
, మంగళవారం, 10 సెప్టెంబరు 2013 (16:31 IST)
FILE
రుతుధర్మాన్ననుసరించి జరుపుకునే పండుగలలో వినాయక చవితి ముఖ్యమైనది. యేటా వర్ష రుతువు చివర్లో భాద్రపద శుద్ధ చవితినాడు వస్తుందీ పండగ. వేసవి తాపం తగ్గి, బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకుని పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. పుష్పాలు విచ్చి పరిమళాలు వెదజల్లుతుంటాయి.

నదులలో నీరు నిండి జీవనతత్వం అభివృద్ధి చెందుతుంది. బుధుడు అధిపతియైన హస్త... వినాయకుని జన్మనక్షత్రం. బుధగ్రహానికి ఆకుపచ్చనివంటే ఇష్టం. వినాయకునికి కూడా గడ్డిజాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఆయనకు గరికతోనూ, వివిధ ఆకులతోనూ పూజిస్తాం.

గణేష పూజకు ఒండ్రుమట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను మాత్రమే ఉపయోగించడంలో ఒక విశేషముంది. అదేమంటే జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి. బంకమట్టికోసం జలాశయాలలో దిగి మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది. నీళ్లు తేటపడతాయి. అదీకాక మట్టిని తాకడం, దానితో బొమ్మను చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి. ఒండ్రుమట్టిలో నానడం ఒంటికి మంచిదని ప్రకృతి వైద్యులు చెబుతారు.

ప్రకృతి చికిత్సకు ఒండ్రుమట్టిని వాడటం మనకు తెలిసిందే. అయితే పదిరోజుల పాటు పూజలు చేసిన వినాయక విగ్రహాన్ని పదకొండోరోజున మేళతాలతో జల నిమజ్జనం చేయడంలో ఒక వేదాంత రహస్యం ఉంది. పాంచభౌతికమైన ప్రతి ఒక్క పదార్థం, అంటే పంచభూతాల నుంచి జనించిన ప్రతి ఒక్క సజీవ, నిర్జీవ పదార్థమూ మధ్యలో ఎంత వైభవంగా, ఇంకెంత విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలిసిపోవలసిందే. అందుకే ప్రకృతి దేవుడైన వినాయక విగ్రహాలను మట్టితోనే చేస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, నైవేద్యాలు సమర్పించి నీటిలో నిమజ్జనం చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu