జీన్స్ ప్యాంటు... టీషర్టు... చేతిలో గిటారు... అయ్యో నగరంలోకి కొత్త పాప్ సింగర్ వచ్చాడని అనుకుంటున్నారా... ఇంత లావు ఉండే ఈయన పాప్ సింగర్ ఏమిటీ... అనే అనుమానం వస్తోంది కదూ... ఇంకాస్తా తలపైకెత్తి చూడడండి... ఇప్పుడైనా అర్థమైందా ఆయన ఎవరనేది. ఇంకా అర్థం కాకపోతే ఏం చేస్తాం మేమే చెప్పేస్తాం... ఆయనేనండీ... మన గణేషుడు.. తొండం చూసైనా మన వినాయక స్వామేనని గుర్తించండి.
వినాయక ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ కుర్రకారుతో కలిసి ఆయన ఇలాంటి వేషధారణతో భక్తులకు ముక్తి ప్రాసాదిస్తున్నారు. కాదంటారా రండీ పాత బస్తీలోకి వెళ్లదాం... హైదరాబాద్‌లో గణేష్ భక్తులు వినాయక విగ్రహాలను చిత్రవిచిత్ర ఆకారాలలో చూపి భక్తులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
పాత బస్తీలోని ఓ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంది. సంప్రదాయాలను తప్పించి తయారు చేసినా విగ్రహం మాత్రం చూడచక్కగా కనిపిస్తోంది. జీన్సు ప్యాంటు, టీషర్టు వేసుకున్నట్లు విగ్రహాన్ని రూపుదిద్దారు. అదే సమయంలో చేతిలో గిటారును పెట్టారు. దీంతో వినాయకుడు కాస్త హైదరాబాద్ పాప్ సింగర్‌గా మారిపోయారు. మరో చోట వినాయక విగ్రహాన్ని పూర్తిగా గవ్వలతో తయారు చేశారు.