Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"వెజ్ చెన్నా చోలీ" సూపర్ టేస్ట్..!

Advertiesment
వెజ్ చెన్నా చోలీ
FILE
బయట చూస్తే చల్లటి వాతావరణం, ఇంట్లో వేడి వేడి చాట్స్ చేసుకుని తినాలని ఉందా..? అయితే సూపర్ "వెజ్ చెన్నా చోలీ"ని రెడీ చేసుకుని వేడి వేడిగా టేస్ట్ చేయండి.

వెజ్ చెన్నా చోలీ ఎలా చేయాలంటే..? ముందుగా ఆలూ, బీన్స్ క్యారెట్, క్యాబేజి, కాలిఫ్లవర్, కాప్సికమ్.." వీటినన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆఫ్ బాయిల్ చేసుకుని (ఆఫ్ బాయిల్ చేసిన కూరగాయల ముక్కలు: ఒక కప్పు) పక్కన పెట్టుకోవాలి.

ఒక కప్పు బాగా నానిన తెల్లశెనగల్లో కొంచెం ఉప్పు, ఒక అర చెంచా నూనెతో పాటు ఒక పలుచని వస్త్రంలో అర చెంచా టీ పొడి వేసి మూటకట్టి, చెన్నాతో కలిపి ఉడికించి పక్కన బెట్టుకోవాలి. చెన్నా ఉడికిన తర్వాత టీ బ్యాగ్‌ను తీసేయాలి. తర్వాత రెండు ఉల్లిపాయలను ముక్కలుగా కోసి వేయించి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. అలాగే రెండు టమోటాలు ఉడికించి పీచు తీసి ముద్దచేసుకోవాలి.

ఇక వెజ్ చెన్నా చోలీ ఎలా చేయాలంటే..? మూకుడులో నూనె వేసి వెచ్చ బడ్డాక బిర్యానీ ఆకు, సాజీరా, లవంగం, యాలకుల పొడి వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి సగం వేగాక, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను కూడా వేసి బాగా వేపుకోవాలి. అనంతరం సన్నగా తరిగిన టమోటా ముక్కలన్ని అందులో చేర్చాలి.

అల్లం, ఉల్లిపాయలు, టమోటా పేస్ట్ కూరలా వచ్చేదాక బాగా వేయించాలి. కూరగా అయిన మిశ్రమంలో జీడిపప్పు పేస్ట్‌ను వేసి కలపాలి. తర్వాత ఉల్లి, టమోటా గుజ్జుని కలపి ఐదు నిమిషాల పాటు వేడిపై ఉంచి, తర్వాత ఆఫ్ బాయిల్ చేసిన ఒక కప్పు కూరగాయల ముక్కలు, తెల్ల శెనగలు వేసి తగిన ఉప్పు వేసి కలియ తిప్పాలి.

కాసేపు మంటపై తెల్లశెనగల మిశ్రమాన్ని ఉడికించి, రెండు చెంచాల పెరుగు, వెన్నతో పాటు చెన్నా ఉడికించిన నీళ్లు పోసి కూరను మరి కాసేపు ఉడికించాలి. ఇప్పుడు ఆమ్చార్ పౌడర్, గరం మసాలా పొడి, వేయించిన ధాన్యం, జీరా పొడి చేర్చాలి.

ఘుమ ఘుమా వాసన వస్తుండగానే చోలే మసాలా సరిపడా వేసి మరో ఐదు నిమిషాలు నుంచి పది నిమిషాలు ఉంచి, స్టౌ మీద నుంచి దించేయాలి. ఇంకేముంది.. వెజ్ చోలీ రెడీ..!

ఎలా సర్వ్ చేయాలంటే..? కూరపైన కమ్మటి మీగడ పరిచి, డెకరేషన్‌కి తరిగిన పుదీనా, కొత్తిమీరను కూరచుట్టూ చల్లి వేడివేడిగా నాన్, బటర్ రోటీలకు సైడిష్‌గా సర్వ్ చేయొచ్చు.

- దమయంతి

Share this Story:

Follow Webdunia telugu