ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీన్స్‌లో యాంటీయాక్సిడెంట్స్, ఫైబర్, ప్రోటీన్, బి విటమిన్స్, ఐరన్, మాగ్నీషియం, పొటాషియం, కాపర్, జింక్ వంటి ఎనో పోషకాలున్నాయి.
బీన్స్‌లోని రకాలను ఆహారంలో కొద్దికొద్దిగా చేర్చుకోవడం ద్వారా డయాబెటిస్, గుండె సంబంధిత రోగాలను నియంత్రించవచ్చు. ఇంకా కొలెస్ట్రాల్ క్యాన్సర్‌కు కూడా చెక్ పెట్టవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. అలాంటి బీన్స్‌ను టేస్టీగా ఉండే మసాల బీన్స్గా ఎలా చేయాలో మీకు తెలుసా.. ? అయితే ట్రై చేసి చూడండి.
కావలసిన పదార్థాలు: సోయా చిక్కుళ్ళు - ఒక కప్పు ఉల్లిపాయలు - అరకప్పు ఛాట్ మసాలా - అర స్పూన్ రిఫైండ్ ఆయిల్ - వేయింపుకు తగినంత టమాట తరుగు - పావు కప్పు వెల్లుల్లి, అల్లం పేస్ట్ - ఒక స్పూన్ పచ్చి మిర్చి - ఒకటి పసుపు - చిటికెడు. ఉప్పు - సరిపడా.
తయారీ విధానం : సోయా చిక్కుళ్ళను శుభ్రంగా కడిగి ఒక రాత్రంతా నానబెట్టి ఆపై కుక్కర్లో పది నిమిషాలు ఉడికించాలి. అల్లం, వెల్లుల్లి, టమాట, ఉల్లిపాయలు, పచ్చి మిర్చిలను సన్నగా తరిగి పక్కనబెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి వేసి దోరగా వేగాక ఉల్లిపాయలు, టమాట ముక్కలు వేసి సన్నని సెగపై దోరగా వేపుకోవాలి.
తర్వాత పచ్చి మిర్చి, ఉప్పు, పసుపు, మిర్చిపొడి, చిక్కుళ్ళు వేసి రెండు నిమిషాలు ఉడికించాక రెండు కప్పుల నీళ్ళు పోసి మరో పది నిమిషాలు సన్నని సెగపై ఉడికించాలి. పైన ఛాట్ మసాలా చల్లాలి. వేడిగా ఉన్నప్పుడే ఈ సోయాబీన్స్‌ను రోటీలకు లేదా వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.