వంకాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక కంటెంట్ ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ మీద పోరాడటానికి సహాయపడుతుంది. చ్లోరోగేనిక్ యాసిడ్ వంకాయలో ప్రధాన యాంటి ఆక్సిడెంటుగా పరిగణిస్తారు. ఇది ఫ్రీ రాడికల్స్ చర్య వలన వ్యాధులను నిరోధించడానికి సహాయపడుతుంది. ఈ వంకాయతో ఘుమఘుమలాడే గుత్తివంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం
కావలసిన పదార్థాలు :
వంకాయలు - 5 పెద్దవి
ఉల్లిపాయలు - 1 పెద్దది సన్నగా తరిగినవి
టమోటాలు - 2 సన్నగా తరిగినవి
వేరుశెనగపప్పు - 15 - 20
చింతపండు - 2 నిమ్మకాయలంత
వెల్లుల్లి - 4-5 రెబ్బలు
తరిగిన పచ్చికొబ్బరి - 1 /2 కప్పు
పసుపు - 1 స్పూన్
కారం - కావలసినంత
అల్లం వెల్లుల్లి పేస్టు - కావలసినంత
జీలకర్ర - కావలసినంత
ఎండు మిర్చి - 4
నూనె - సరిపడేంత
నువ్వులు - సరిపడేంత
ఉప్పు- సరిపడేంత
ఆవాలు - 1 స్పూన్
మెంతులు - 1 స్పూన్
తయారీ విధానం :
ముందుగా వేరుశెనగపప్పుని ఒక పాత్రలో వేయించి ప్లేటులోకి తీసుకోవాలి. అదే పాత్రలో ఎండుమిర్చిని కూడా వేయించి తీసుకోవాలి. ఇవన్నీ వేయించిన తరువాత వేరే పాత్రలో నువ్వులు, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేయించి తీసుకోవాలి. ఇవన్నీ సమపాళ్ళలో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మిశ్రమంతో పాటు పచ్చి కొబ్బరి, ఉప్పు, వెల్లుల్లి కొంచెం నీరు పోసి పేస్ట్‌గా మిక్సిలో రుబ్బుకోవాలి.
పెద్ద వంకాయలైతే ఆరు భాగాలుగా, చిన్న వంకాయలైతే నాలుగు భాగాలుగా మధ్య వరకూ కోసుకోవాలి. ఒక గిన్నెలో చింతపండును నానపెట్టాలి. ముందుగా మనం తయారుచేసుకున్న మిశ్రమాన్ని కట్ చేసి పెట్టుకున్న వంకాయలో పూర్ణంలా పెట్టాలి.
ఇప్పుడు ఒక పాత్రలో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి. దీనిలో కరివేపాకు, తగినంత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేగించుకోవాలి. ఇవి బాగా వేగిన తరువాత ముందుగా తయారుచేసుకున్న వంకాయలను కూడా వేసి రెండు నిముషాల పాటు వేయించాలి. ఇందులో తరిగిన టమోటా ముక్కలను వేసి మగ్గనివ్వాలి. నానపెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అందులో తగినంత ఉప్పు, కారం పసుపు వేసి కలిపి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అంతే ఘుమఘుమలాడే గుత్తివంకాయ కూర రెడీ.