రోటీలకు సైడిష్ ఒకేలా ట్రై చేసి బోర్ కొడుతుందా.. అయితే హిమాచల్ ప్రదేశ్ స్పెషల్ చెనా కర్రీ ట్రై చేయండి. ఫ్యాట్ ఫ్రీ, సోడియం ఫ్రీ అయిన చన్నాను తీసుకుంటే హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. అలాంటి చెనాతో టేస్టీ కర్రీ ట్రై చేద్దామా.. ఎలా తయారు చేయాలంటే?
కావలసిన పదార్థాలు :
చన్నా : మూడు కప్పులు
పెరుగు : రెండు కప్పులు
ఇంగువ : చిటికెడు
లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకులు : రెండేసి
జీలకర్ర : ఒక టేబుల్ స్పూన్,
పసుపు : ఒక టేబుల్ స్పూన్
ధనియాల పొడి : రెండు టీ స్పూన్లు
పంచదార : అర టేబుల్ స్పూన్
ఉప్పు, నూనె : రుచికి సరిపడా
డ్రై ఫ్రూట్స్ ముక్కలు : రెండు టేబుల్ స్పూన్లు
నెయ్యి : నాలుగు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం :
ముందుగా చన్నాను రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి, కాస్త ఉప్పుతో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన చెనాలోని నీటిని గిన్నెలోకి వంపుకుని పక్కన బెట్టుకోవాలి. తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక నెయ్యి వేసి, అందులో ఇంగువ, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు, యాలకులు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి ఒకనిముషం వేగించుకోవాలి. తర్వాత అందులోనే పసుపు, ధనియాల పొడి వేసి దోరగా వేపుకోవాలి.
మరొక గిన్నెలో పెరుగు, పంచదార వేసి వేసి స్పూన్‌తో బాగా గిలకొట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని పోపు వేగుతున్న పాన్‌లో పోయాలి. మంటను తగ్గించి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంలో ఉడికించి పెట్టుకొన్న శెనగలు, రుచికి సరిపడా ఉప్పు మరియు డ్రై ఫ్రూట్స్ వేసి బాగా మిక్స్ చేయాలి. పది నిమిషాల తర్వాత దించేస్తే చెనా కర్రీ రెడీ. ఈ కర్రీని వేడి వేడి అన్నంతో గానీ రోటీలకు సైడిష్‌గా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.