గృహంలో ఆగ్నేయభాగమున వంటగదిని ఏర్పాటు చేస్తే ఎన్నో శుభఫలితాలనిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. కుటుంబ సుఖ-శాంతులకు ఆగ్నేయదిశలో వంటగది ఏర్పాటు ముఖ్యమని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంకా తూర్పు, ఉత్తర, ఈశాన్యముల కంటే ఆగ్నేయములో ఎక్కువ ఖాళీ స్థలము ఉంటే అశుభ ఫలితాలు కలుగుతాయని వారు చెబుతున్నారు.
ప్రతి నివాస గృహంలో తప్పనిసరిగా వంటగది నిర్మించటం జరుగుతుంది. గృహ యజమాని స్థోమతను బట్టి ఇంట్లో వంటగది ఏర్పాటు చేసుకంటూ వస్తున్నాం. ఆ వంటగదిని గృహవాస్తు ప్రకారం మూడు విధాలుగా ఏర్పాటుచేస్తున్నాం. గృహావరణలోని ఖాళీ ప్రదేశంలో ఒక ఉపగృహం నిర్మించి దాన్ని వంటగదిగా వాడటం, గృహంలో ఒక గదిని వంటగదిగా వాడటం మరీ చిన్న గృహాల్లో అయితే ఇంట్లోనే ఒక మూలన వంట చేసుకోవటం.
వాస్తు రీత్యా వంట లేదా అగ్ని అనేది గృహం ఆవరణలో అగ్ని స్థానమైన ఆగ్నేయంలో ఉండాలి. విశాలమైన ఆగ్నేయ ఆవరణ ఉన్నవాళ్లు ఉపగృహంలో వంటగది ఏర్పాటుచేసుకోవచ్చు.
ఇకపోతే.. వంట గదిలో నీళ్లు సింకు పొయ్యికి వీలైనంత దూరంలో గదికి ఈశాన్యంలో పెట్టాలి. వంటగదికి రెండు కిటికీలు పెట్టడం మంచి ఫలితాలు చేకూరుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు.