వాలెంటైన్ డే: రాశిని బట్టి మీ ప్రేయసి/ప్రియునికి గిఫ్ట్
వాలెంటైన్ డే సెలబ్రేషన్‌కు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. తమ తమ ప్రేయసీ ప్రియుల హృదయాలను మీటగలిగే అపూరూపమైన బహుమతులను ఇవ్వాలని ఉవ్విళ్లూరుతుంటారు. నిజానికి ఎవరికైనా ఓ బహుమతి కొని ఇవ్వాలంటే దానిని ఎంపిక చేసేందుకు కాస్తంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. ప్రేమికుల విషయానికి వస్తే... గిఫ్ట్ సెలక్షన్‌కు ఓ పట్టాన టైము సరిపోదు. కొంతమంది ఏదో కానిచ్చేద్దాంలే అని అనుకునేవారూ ఉంటారు. కానీ గుండెల్లో గూడుకట్టుకున్న ప్రేమికుడు/ప్రేయసికి ఇచ్చే బహుమతి విషయంలో మాత్రం రాజీ కూడదు. అయితే బహుమతి కొనేముందు మీ లవర్ ఇష్టాయిష్టాలను పరిగణలోకి తీసుకోవాలి. ఆ బహుమతిని చూసిన మీ లవర్ సంతోషం హద్దులు దాటిపోవాలి. అంతేతప్ప ఎందుకొచ్చిన బహుమతిరా బాబు అని అనుకోకూడదు. ఏయే రాశివారు ఎటువంటి బహుమతులను ఇవ్వాలన్న దానిపై కొన్ని సూచనలు.మేష రాశి ప్రియురాలు/ప్రియుడు మేష రాశికి చెందినవారు ధైర్యవంతులు, చురుకైనవారుగానూ ఉంటారు. దేన్నైనా ప్రేమించే మనస్తత్వం కలిగినవారై ఉంటారు కనుక వీరికి ఇచ్చే బహుమతులు విషయంలో కాస్త వెసులుబాటు ఉన్నదనే చెప్పుకోవచ్చు. అమ్మాయిల విషయానికి వస్తే... మంచి హ్యాండ్ బ్యాగులు, హెయిర్ అలంకరణలు, కళ్లద్దాలు, బెల్టులు వంటి బహుమతులతో సంతృప్తిపరచవచ్చు. అంతేకాదండోయ్... ఎరుపు రంగు రోజాపూలు, మత్తెక్కించే సువాసనల అత్తరులు చాలా చాలా ఇష్టపడతారు. కనుక అటువంటి వాటితో మేష రాశి అమ్మాయిలను ప్రసన్నం చేసుకోవచ్చు. ఇక అబ్బాయిల విషయానికి వస్తే వీడియో గేములు, సినిమా లేదా పాటల డీవీడీలు, సీడీలు, తాజా సినిమాలకు సంబంధించి టిక్కెట్లు కొని సినిమాకు చెక్కేద్దామంటే ఎగిరి గంతేస్తారు. ఇదీ మేషరాశి అబ్బాయిల పరిస్థితి. తెలుసుకున్నారుగా... ప్రొసీడ్...
వృషభరాశికి చెందిన ప్రేమికులు ఈ రాశికి చెందినవారు చాలా నెమ్మదస్తులు. ఉన్నతమైన వస్తువులంటే వారికి ఎనలేని ప్రీతి. ఖరీదైన వస్తువుల పట్ల మక్కువ ఎక్కువ. లగ్జరీ ఐటమ్ ఏదైనా వారికి ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. వృషభరాశికి చెందిన అమ్మాయిలు ధగధగలాడే కంఠాభరణాలను ఎక్కువగా ఇష్టపడతారు. ఇవికాకపోయినా బ్రాస్లెట్స్, గాజులు వంటివి సంతోషాన్ని కలిగిస్తాయి. ఇంకా అందమైన దుస్తులను ఇవ్వడం ద్వారా కూడా వీరిని తృప్తిపరచవచ్చు. ఇక అబ్బాయిల విషయానికి వస్తే... మధుర గాయకులు ఆలపించిన మంచి మంచి పాటల క్యాసెట్లను బహూకరిస్తే చాలు.. ఐస్ అయిపోతారు. అలాకాకపోతే వీడియో గేమ్స్, కార్లలో అలంకరించుకునే ఏదైనా వస్తువు, లేదంటే మంచి విలువు కలిగిన వస్తువైనా వీరిని కట్టిపడేస్తుంది. అవన్నీ కుదరకపోతే ఓ పెద్ద రెస్టారెంట్‌కి తీసుకెళ్లి వారికి నచ్చిన మెనూ ఆర్డర్ చేసి అతనితో కలిసి ఆరగిస్తే చాలు.. తన హృదయం మీకోసమే కొట్టుకుంటుంది. మరింకేం.. ట్రై చేయండి.మిధునరాశికి చెందిన ప్రేమికులు మిధునరాశికి చెందినవారు మేధాపరమైన, ఆశ్చర్యాన్ని రేకిత్తించే వస్తువుల పట్ల మక్కువ చూపుతారు. జ్ఞానాన్ని సముపార్జించే ఎటువంటి వస్తువైనా వీరిని సంతృప్తి పరుస్తుంది. మిధునరాశికి చెందిన అమ్మాయిల విషయానికి వస్తే... వీరికి మేధాశక్తిని పెంచే పుస్తకాలతోపాటు లవ్ మెసేజ్‌లను పంపుకునే రికార్డెడ్ పరికరాలంటే చాలా చాలా ఇష్టం. ఇక అబ్బాయిలకు కంప్యూటర్, ఆసక్తికర అంశాలను తెలిపే డీవీడీలంటే ఎంతో ఇష్టం.