ప్రేమ అంటే ఒక తియ్యని అనుభూతి అని ప్రేమికులు చెబుతారు.... ప్రేమ అంటే ఒక మాయ, ఉచ్చు అని ప్రేమను ద్వేషించేవారు అంటుంటారు... ప్రేమ అంటే డబ్బు లేని అమ్మాయి, డబ్బున్న అబ్బాయిని ప్రేమించడం లేదా డబ్బు లేని అబ్బాయి, డబ్బు ఉన్న అమ్మాయిని ప్రేమించడం అని కొంతమంది అభిప్రాయం.
ఈ ప్రేమ అనేది యవ్వనంలో కలిగే ఆకర్షణ, మోహం అని ఎవరికి తోచినట్లు వారు అభివర్ణిస్తారు. ఇలా ప్రేమపై... ఎవరు ఎలా చెప్పినప్పటికీ... చిట్టచివరికొచ్చేసరికి ప్రేమ ఎంతో పవిత్రమైనదని అందరూ ముక్తకంఠంతో చెప్తారు. ఎందుకంటే ప్రేమ రుచిని, తీయదనాన్ని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో అనుభవించే ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు.
ఇంతమంది ఇన్ని విధాలుగా చెబుతూ ఉన్నప్పటికీ ప్రేమ మాత్రం తన స్థానాన్ని ప్రతి ప్రేమ హృదయంలోనూ పదిలంగానే ఉంచుకుంది. ఎప్పటికప్పడు తన మాధుర్యాన్ని ఒలికిస్తూ... ప్రేమికుల హృదయాలను ప్రేమలోకంలో విహరింపజేస్తోంది. అయితే ఈ అపురూపమైన ప్రేమ గగన తలంలో విహరిస్తూ, తనకై ఆరాటపడేవారికి అందకుండా పైపైకి పోతూ ఉంది. అయినా అంత ఎత్తుకు ఎగిరి దానిని అందుకున్న వారి జీవితం స్వర్గమే అవుతుంది.
ఇలా కొందరి ప్రేమ జీవితాలను స్వర్గమయం చేసే అసలు సిసలైన ప్రేమ ఎలా ఉంటుందీ..? అనే ప్రశ్నకు ఇప్పటికీ ఎవరూ సరైన వివరణను ఇవ్వలేకపోయారు. ఎంతోమంది కవులు, రచయితలు, ప్రేమికులు ప్రేమను ఆస్వాదించి, అనుభవించి కూడా దానికి ఇప్పటికీ సరైన వివరణను ఇవ్వకపోవడమే ప్రేమ యొక్క లోతుకు నిదర్శనం. ప్రేమ అనేది రెండు అక్షరాల కలయిక. అంతేనా రెండు హృదయాల మధ్య ఏర్పడే బంధం.
ఈ ప్రేమ ఎంతటి కార్యన్నైనా సాధించే శక్తిని, ఆత్మస్ధైర్యాన్ని, పట్టుదలను అందిస్తుంది. ఇదే ప్రేమ మూర్ఖత్వాన్ని, రాక్షసత్వాన్ని కూడా పుట్టిస్తుంది. చరిత్రలో జరిగిన ఎన్నో యుద్ధాలకు ప్రేమే మూలకారణం. మనకు స్వాతంత్రం కూడా ఆ ప్రేమ మూలంగా లభ్యమైంది అంటే నమ్ముతారా..! కాని ఇది నిజం... ప్రేమకు స్వాతంత్ర పోరాటానికి సంబంధం ఏమిటా అని ఆలోచిస్తున్నారు కదూ. చెబుతాను వినండి. మనం స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటున్నాము అంటే దానికి కారణం మన జాతిపిత బాపూజీ..
ఆయనకు మన దేశమన్నా, దేశ ప్రజలన్నా చాలా ప్రేమ. ఆ ప్రేమే భారతావనిలో అందరినీ ఏకతాటిపై చేర్చి, అందరి హృదయాలను ఏకం చేసి తెల్లదొరలపై విరుచుకుపడింది. ఫలితమే... మనం ఈనాడు అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్రాలు. చూశారా... ప్రేమ పోరాటాలను సృష్టిస్తుంది, సుఖశాంతులనూ సృష్టిస్తుంది.
నా ఈ భావనతో మీరు ఏకీభవిస్తున్నారనుకుంటాను. ప్రేమే కదా అని చులకనగా చూస్తే.... అది ఉప్పెనలా మారి ప్రాణాలను హరిస్తుంది...... ప్రేమే దైవమని భావిస్తే, మంచి నీరై దాహం తీర్చి ప్రాణాన్ని కాపాడుతుంది....ఎందుకంటే ప్రేమ అంటే రెండు మనస్సుల మధ్య మూగభాష. ఆ భాషను అర్థం చేసుకున్నవారికి జీవితాంతం ప్రేమామృతం లభిస్తుందంటాను నేను.
కాదనగలరా!!??